
● జిల్లా కలెక్టర్ రాజకుమారి
అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌లు
నంద్యాల న్యూటౌన్: జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈ పార్క్‌ల ఏర్పాటు చేయనున్నామని, ఇందుకు ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని ఆర్డీఓలు, తహసీల్దార్లను జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. పాణ్యం, సుగాలిమెట్ట ప్రాంతాల్లో 50, డోన్ మండలం ఉంగరాలగుట్ట ప్రాంతంలో 100 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందన్నారు. సంబంధిత ప్రాంతాల్లో ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు చేసే సాధ్యాసాధ్యాలపై పరిశీలించాలన్నారు. రిలయన్స్ కంప్రెస్సెడ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు జిల్లాలో 5 వేల ఎకరాలను గుర్తించి నివేదికలు ఇవ్వగా అందులో 765 ఎకరాల్లో ఏర్పాటు చేయడానికి సంస్థ నుంచి అంగీకారం వచ్చిందన్నారు. అందులో గడివేములలో 300, చాగలమర్రిలో 105, రుద్రవరంలో 190, ఆళ్లగడ్డలో 170 ఎకరాలు ఉన్నాయన్నారు. పీఎం కుసుమ్ సంబంధించి పాణ్యం, నంద్యాల, గోస్పాడు, జూపాడుబంగ్లా, భానుముక్కల, ప్యాపిలి మండలాల్లో 10 ఎకరాల మేరకు ప్రభుత్వ భూములు పరిశీలించి సబ్ స్టేషన్ల ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డీఆర్‌ఓ రాము నాయక్, నంద్యాల, ఆత్మకూర్, డోన్ ఆర్డీఓలు విశ్వనాథ్, నాగజ్యోతి, నరసింహులు తదితరులు పాల్గొన్నారు.