
భద్రతా లోపం.. పర్యవేక్షణ శూన్యం
త్వరలో భద్రతాధికారిని నియమిస్తాం
శ్రీశైల ఆలయంలో చోరీ సంఘటన జరగడం దురదృష్టకరం. దేవస్థానంలో ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఇటీవలే ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. దేవస్థాన సీఎస్‌వో పోస్టుకు అనేకసార్లు నోటిఫికేషన్ ఇచ్చాం. త్వరలోనే రిటైర్డ్ డీఎస్పీ స్థాయి అధికారిని, జూనియర్ కమాండెంట్ ఆఫీసర్‌ని శ్రీశైలం సీఎస్‌వోగా నియమించేందుకు చర్యలు చేపడుతున్నాం. – ఎం.శ్రీనివాసరావు,
శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహణాధికారి
నలుగురికి రిమాండ్
హుండీ నగదు చోరీ కేసులో సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించాం. తెలంగాణకు చెందిన సంగనమోని రమేష్, అతనితో సహ జీవనం చేసే కె.లక్ష్మీ, మరో ఇద్దరు మైనర్లను ఉచిత క్యూలైన్ వద్ద అదుపులోకి తీసుకున్నాం. వీరి నుంచి రూ.10,150 స్వాధీనం చేసుకున్నాం. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాం.
– జి.ప్రసాదరావు, శ్రీశైలం సర్కిల్ ఇన్‌స్పెక్టర్
శ్రీశైలం టెంపుల్: కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్త దేవాలయాల పర్యవేక్షణ గాలికి వదిలేసింది. ఇటీవల తిరుమలలో చోటుచేసుకున్న తొక్కిసలాట, సింహాచలంలో గోడకూలిన ఘటన, శ్రీశైల దేవస్థానంలో వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం. కొన్ని నెలల క్రితం శ్రీశైలం టోల్‌గేట్‌లో చోటుచేసుకున్న అవినీతి కుంభకోణం, అలాగే టికెట్ల మార్ఫింగ్, ప్రస్తుతం హుండీ చోరీ ఘటనలు మల్లన్న సన్నిధిలో భద్రత డొల్లతనాన్ని బయటపెడుతోంది. శ్రీశైల మహాక్షేత్రంలో వెలసిన శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి వార్ల దర్శనానికి నిత్యం భక్తులు వేలాదిగా తరలివస్తారు. స్వామి అమ్మవార్లను దర్శించుకుని భక్తులు కానుకలను సమర్పిస్తారు. ఇందుకోసం ఇనుప హుండీలు, క్లాత్ (గుడ్డ) హుండీలను దేవస్థానం ఏర్పాటు చేసింది. ఈ నెల 1వ తేదీన ఇద్దరు వ్యక్తుల సహకారం, ప్రోత్సాహంతో మరో ఇద్దరు మైనర్లు భక్తుల రూపంలో ఉచిత క్యూలైన్ ప్రవేశమార్గం ద్వారా ఆలయంలోకి ప్రవేశించారు. గర్భగుడిలోని రత్నగర్భ గణపతి ఆలయం వద్దగల క్లాత్ (గుడ్డ)తో ఏర్పాటు చేసిన హుండీని బ్లేడ్‌తో కోసి అందులో నుంచి రూ.10,150 దొంగతనం చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉందని తెలిసి కూడా అధికారుల అలసత్వాన్ని ఆసరాగా తీసుకుని దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. గర్భగుడిలో చోరీ ఘటనపై విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన టెంపుల్ ఇన్‌స్పెక్టర్‌ను దేవస్థాన కార్యనిర్వహణాధికారి సస్పెండ్ చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూంలో సీసీ కెమెరాలను పర్యవేక్షించాల్సిన సెక్యూరిటీ గార్డులు కూడా నిర్లక్ష్యం వహించారని ఇద్దరిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగించారు.
శ్రీశైలం పర్యవేక్షణ గాలికి..
శ్రీశైలక్షేత్ర భద్రతను, పర్యవేక్షణను కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో, ఉగాది మహోత్సవాల్లో సైతం భక్తులకు అరకొర సౌకర్యాలు కల్పించారని భక్తులు విమర్శించారు. అలాగే శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో శివస్వామిపై వ్యాపారస్తులు దాడిచేసి గాయపరచిన ఘటన చోటుచేసుకుంది. టోల్‌గేట్‌లో అవినీతి కుంభకోణం చోటుచేసుకుంది. అంతేకాకుండా వీఐపీ బ్రేక్ స్పర్శదర్శనం టికెట్లను మార్ఫింగ్ చేసి భక్తులకు విక్రయించిన ఘటన తెలిసిందే. ప్రస్తుతం గర్భగుడిలో హుండీ చోరీ ఘటన కలకలం రేపుతోంది.
రెగ్యులర్ ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్ లేని వైనం
శ్రీశైల దేవస్థాన భద్రతను పర్యవేక్షించేందుకు, ఉభయ దేవాలయాల్లోకి అసాంఘిక శక్తులు, నిషేధిత పదార్థాలు తీసుకెళ్లకుండా క్షేత్ర భద్రతను దేవస్థాన ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్ పర్యవేక్షిస్తారు. అయితే గత కొన్ని నెలల నుంచి దేవస్థానం సీఎస్‌వో పోస్టు ఖాళీగా ఉంది. దేవస్థాన పర్యవేక్షకులకే ఇంచార్జి సీఎస్‌వోగా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కాలం నెట్టుకొస్తున్నారు. అలాగే దేవస్థానంలో డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యండ్ ప్రేమ్ మెటల్ డిటెక్టర్లు, లగేజి స్కానర్లు ఉన్నప్పటికీ అలంకారప్రాయంగానే ఉండిపోయాయి.
మల్లన్న సన్నిధిలో భద్రత డొల్ల
ఏకంగా గర్భగుడిలోని క్లాత్ హుండీని
కోసి డబ్బు దొంగతనం
ఇద్దరు మైనర్లకు మరో ఇద్దరి
సహకారం
ఈఓ ఆదేశాలతో శ్రీశైలం పీఎస్‌లో
సీఎస్‌ఓ ఫిర్యాదు
నిందితులు రిమాండ్‌కు తరలింపు
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన
టెంపుల్ ఇన్‌స్పెక్టర్ సస్పెన్షన్