
‘సాక్షి’ కార్యాలయంపై దాడి హేయం
● దాడి చేసిన వారిపై
కేసు నమోదు చేసి
అరెస్ట్ చేయాలి
● ఏపీయూడబ్ల్యూజే జిల్లా
అధ్యక్షుడు మధు
నంద్యాల: సాక్షి దిన పత్రికలో వార్త వచ్చిందని ఆ పత్రిక కార్యాలయంపై దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధు అన్నారు. ఏలూరు జిల్లా ‘సాక్షి’ కార్యాలయంపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని ఖండిస్తూ ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా ఎస్పీ అదిరాజ్‌సింగ్ రాణాను కలిసి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు మధు, జిల్లా ఉపాధ్యక్షుడు ఆవుల బాలమద్దిలేటి మాట్లాడుతూ.. పత్రికలో వచ్చిన వార్తల్లో వాస్తవాలు లేకుంటే దానికి వివరణ ఇచ్చుకోవాలన్నారు. అయితే కార్యాలయంపై దాడులకు పాల్పడటం సిగ్గు చేటన్నారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సాక్షి పత్రిక కార్యాలయంలోనే కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేయడమే కాక విధి నిర్వహణలో ఉన్న విలేకరిపై దాడి చేయడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ తప్పు ఒప్పులను, అక్రమాలను, నిజాలను బయట పెట్టే బాధ్యత మీడియాకు ఉందన్నారు. ప్రభుత్వంలోనే కొందరు నేతలు పత్రికల్లో వార్తలు వస్తే జర్నలిస్టులను భయపెట్టడానికి చూస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది మంచిపద్ధతి కాదన్నారు. జర్నలిస్టులు హరినాథరెడ్డి, దస్తగిరి, చంద్రవరప్రసాద్, నాగేశ్వరరెడ్డి, మోహన్, అబ్దుల్‌కరీం తదితరులు పాల్గొన్నారు.