గోస్పాడు: సంపద సృష్టిస్తాం.. సంక్షేమ పథకాలు అందిస్తాం’ అంటూ ఎన్నికలు ముందు ఆర్భాటాలు పలికిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల సంక్షేమాన్ని విస్మరించారు. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను కొన్నింటిని నిలిపివేయడంతో పాటు మరికొన్ని పథకాల్లో లబ్ధిదారులకు కోత పెట్టారు. సామాజిక పింఛన్లలో వృద్ధుల పింఛన్లు ఇప్పటికే కొన్ని నిలిపివేయగా, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లకు కూడా కోత వేసే దిశగా సర్కారు ఇప్పటికే ప్రత్యేకంగా సదరం క్యాంపుల పేరుతో వైద్యపరీక్షలు చేపడుతోంది. ఈ క్రమంలోనే చడీచప్పుడూ లేకుండా పీ – 4 సర్వే నిర్వహిస్తుండటం ప్రజలను విస్మయానికి గురి చేస్తోంది. ఈ సర్వేతో భవిష్యత్తులో ఏమైనా పథకాలు అమలు చేస్తే తాము అనర్హులుగా ప్రకటిస్తారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో 6.05 లక్షల కుటుంబాలు నివసిస్తుండగా, వారిలో 80 శాతం 4,56,786 లక్షల కుటుంబాలకు సర్వే చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు 4,55,815 కుటుంబాలను సర్వే (99.79 శాతం) చేయడంతో పూర్తి చేసినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఫోన్, టీవీ, ఏసీ, ఇతర గృహోపకరణాలు, బైకులు, ఇళ్ల స్వరూపం, రేకులా, స్లాబా, బ్యాంక్ అకౌంట్ వివరాలు అంటూ 27 రకాల ప్రశ్నల్ని సంధించి సమాధానాలను నమోదు చేసి ఆపై ప్రజల మొబైల్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి పీ–4 సర్వే నిర్వహిస్తుండటం సర్వత్రా ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారి అభ్యున్నతికి కృషిచేయడమే సర్వే ముఖ్య ఉద్దేశమని పైకి చెబుతున్నప్పటికీ సర్వేపై ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే..
సర్వేలో సిబ్బంది పొందుపరిచే అంశాలన్నీ ప్రస్తుత జీవనశైలిలో భాగమైనవే. స్మార్ట్‌ఫోన్‌లు, బైకులు వంటివి ఉన్నాయా ఇలాంటి ప్రశ్నలు ఉండటంతో సంక్షేమ పథకాల్లో కోతపడుతుందనే ఆందోళనతో ప్రజలెవరైనా సర్వేకు నిరాకరిస్తే, వారి పేర్లను సైతం నమోదు చేయాలని సిబ్బందికి ఆదేశాలు జారీతో కలవరానికి గురిచేస్తోంది. అలాంటి వివరాలు నమోదు చేసినప్పుడు కూడా బయోమెట్రిక్ ద్వారా ధ్రువీకరించాలని చెప్పడంతో అనుమానాలు బలపడుతున్నాయి. సంపాదనపరుల జాబితాలో వ్యవసాయ కూలీలు, పెన్షనర్ల పేర్లు కూడా చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సర్వేగుట్టు వారికే ఎరుకని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఏసీ ఉన్నా ధనికులేనా...
జిల్లాలో 5.34 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులున్నాయి. కొత్త రేషన్ కార్డుల కోసం మరికొన్ని వేల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. వీరందరినీ దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలుగానే పరిగణించాల్సి ఉంది. అయితే అప్పో సప్పో చేసి, నెలవారీ వాయిదాల పద్ధతిలోనో, లేక మరే ఇతర పద్ధతుల్లోనో ప్రజలు వారి వారి ఇళ్లలో ఏసీలు ఏర్పాటు చేసుకున్నప్పటికీ సదరు వివరాలను ప్రభుత్వ రికార్డుల్లో సిబ్బంది నమోదు చేస్తున్నారు. ఇలాచేస్తే తమకు సంక్షేమ పథకాలు ఆగిపోతాయనే ఆందోళన మధ్యతరగతి ప్రజల్లో నెలకొంది .
నాడు సంక్షేమ పండుగ.. ప్రస్తుతం అన్నింటికీ పాతరే...
ఊరూరా పీ–4 సర్వే చేపట్టిన
కూటమి ప్రభుత్వం
ఇళ్లలో ఉండే వస్తువుల వివరాలు నమోదు
సంక్షేమ పథకాల కోత పడుతుందని ప్రజల అనుమానం
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. సచివాలయ సిబ్బంది, వలంటీర్ల ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందించారు. కానీ, ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సంక్షేమం పూర్తిగా అటకెక్కింది. ఎన్నికల్లో ఓట్లు రాబట్టుకునే వ్యూహంలో భాగంగా చంద్రబాబు నేతత్వంలోని కూటమి నాయకులు ప్రజలకు ఇబ్బడిమొబ్బడిగా హామీలిచ్చారు. అధికారంలోకి వస్తూనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటమార్చారు. పెన్షన్ రూ.వెయ్యి పెంచామని గొప్పలు చెప్పకుంటున్న ప్రభుత్వం విచారణ పేరుతో వేలాది పెన్షన్లను తొలగిస్తున్నారని ఇప్పటికే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పీ–4 సర్వే చేపట్టడం కూడా ఇందులో భాగమేననే సందేహాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
సందేహాలు ఎన్నో...
కుటుంబ సభ్యుల పేరుతో వ్యవసాయ భూమి ఎంత ఉంది, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎన్ని సొంత గృహాలున్నాయి, నాలుగు చక్రాల వాహనాలు ఏమైనా ఉన్నాయా, కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారా, ఇన్‌కం ట్యాక్స్ ఏమైనా చెల్లిస్తున్నారా, నెలకు విద్యుత్ వినియోగం ఎంత, తదితర వివరాలను కూడా సచివాలయ సిబ్బంది సేకరిస్తున్నారు. ఎక్కువభాగం ఆదాయానికి సంబంధించిన ప్రశ్నలే ఉండటం పలు సందేహాలకు తావిస్తోంది.
అపోహలు వద్దు
ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి వారి అభ్యున్నతికి కృషి చేయడమే పీ–4 సర్వే ముఖ్య ఉద్దేశం. జిల్లా లో ఇప్పటికే ప్రభుత్వం నిర్దేంచిన మేరకు సర్వే దాదాపుగా పూర్తి చేశాం. గ్రామసభల ద్వారా సర్వే జాబితాను ప్రజలకు తెలియజేసేలా ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలు యథావిధిగా కొనసాగుతాయి. ఇందులో ఎలాంటి అపోహలకు తావు లేదు. –శివారెడ్డి, డీఎల్‌డీఓ, నంద్యాల
‘సర్వే’జనా.. ఆందోళన