ఆళ్లగడ్డ: అహోబిలంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మంగళవారం రాత్రి మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్రమహా దేశికన్ పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా శ్రీకారం చుట్టారు. ఎగువ అహోబిలంలోని శ్రీ జ్వాలా నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విష్వక్సేనుడికి తల పాగా చుట్టి పల్లకీలో కొలువుంచి ఆలయం వెలుపలకు తోడ్కొని వచ్చారు. ఈ బ్రహ్మోత్సవాలకు పర్యవేక్షుకుడిగా విష్వక్సేనుడు వ్యవహరిస్తారు. అనంతరం పుట్టమన్ను తెచ్చి అంకుర హోమం నిర్వహించి సోమకుంభ స్థాపన చేశారు. బ్రహ్మోత్సోవాల్లో భాగంగా బుధవారం ఎగువ అహోబిలంలో ధ్వజారోహణ కార్యక్రమం, దిగువ అహోబలంలో బ్రహ్మోత్సవ వేడుకలకు అంకురార్పణ పూజలు చేపట్టనున్నారు.
బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ