
అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్న విక్టర్ ప్రసాద్
మంత్రాలయం: కులవివక్ష వీడి అందరూ ఐక్యంగా జీవించాలని ఎస్సీ కమిషనర్ చైర్మన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ పిలుపునిచ్చారు. శుక్రవారం మండల పరిధిలోని సూగూరు గ్రామంలో జై భీమ్ ఆద్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంబేడ్కర్ అందరి వాడని, ఆయన ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. అంతకు ముందు నందవరం మండలం హాలహార్వి నుంచి సూగూరు గ్రామంలోని అంబేడ్కర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. జై భీమ్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో జైభీమ్ నాయకులు రంగన్న, ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య, సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ కిరణ్, గోనెగండ్ల సర్పంచ్ ఐమావతి పాల్గొన్నారు.