
కార్డుదారుడి ఐరిస్ తీసుకుంటున్న దృశ్యం
● బయోమెట్రిక్ సమస్యకు చెక్
● జిల్లాలో 351 ఎండీయూ
వాహనాలకు ఐరిస్ పరికరాలు
● వేలి ముద్ర పడక పోయినా
సరుకులు అందేలా ఏర్పాట్లు
కొలిమిగుండ్ల: రేషన్ కార్డుదారులందరికీ వంద శాతం నిత్యావసర సరుకులు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల పంపిణీలో వినూత్న మార్పులు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 5.33 లక్షల రేషన్ కార్డులున్నాయి. నేరుగా కార్డుదారుల ఇంటి వద్దకే సరుకులు పంపిణీ చేసేలా ఇది వరకే ఎండీయూ వాహనాలను ఏర్పాటు చేసింది. కాగా ఒక్కోసారి ఈ–పాస్ యంత్రాల్లో చాలా మంది వేలి ముద్రలు పడని కారణంగా సరుకులు కార్డుదారులకు అందడం లేదు. ప్రధానంగా కూలీ పనులు చేసుకునే వారి వేలిముద్రలు దాదాపుగా అరిగిపోయి ఉంటాయి. వృద్ధులు, మహిళలతో పాటు పలు వ్యాధిగ్రస్తుల చేతుల వేళ్లు ముడతలు పడి ఉంటాయి. దీంతో ఈ–పాస్ మిషన్ (బయోమెట్రిక్)లో వేలిముద్రలు పడవు. ప్రతి నెలా చౌకదుకాణాల్లో సరుకుల కోసం వెళ్లిన వృద్ధులు, మహిళలు వేలి ముద్రలు పడక సరుకులు తీసుకోలేక పోతున్నామని ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాల్లో ఆర్జీలు వస్తున్నాయి. ఎక్కువ భాగం బయోమెట్రిక్ పడటం లేదన్న సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యకు చెక్ పెడుతూ ప్రభుత్వం జూన్ నెల నుంచే ఐరిస్(కంటి) ఆధారిత ధ్రువీకరణతో సరుకుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. రేషన్ సరుకుల పంపిణీకి బయోమెట్రిక్‌తోపాటు ఐరిస్(కంటి గుర్తింపు) విధానం అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాలోని 351 ఎండీయూ వాహనాల ఆపరేటర్లకు ఐరిస్ పరికరాలు అందజేసి వాటిపై శిక్షణ కల్పించారు. వేలిముద్రలు పడని వారి ఐరిస్ సేకరించి పరికరంలో ఫీడ్ చేస్తారు. వేలిముద్రలు పడక పోతే ఐరిస్ ఆధారంగా రేషన్ సరుకులు అందించనున్నారు.