హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు వెనుకడుగు | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌కు వెనుకడుగు

Jul 23 2026 1:42 AM | Updated on Jul 23 2026 1:42 AM

అపోహలు నమ్మవద్దు

జిల్లాలో ఇప్పటికీ 30 శాతమే పూర్తి

పిల్లలకు వ్యాక్సిన్‌ వేయించేందుకు ఆసక్తి చూపని తల్లిదండ్రులు

అపోహలు వీడాలంటున్న వైద్యులు

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అపోహలు ఉన్నాయి. వాటిని యుక్త వయసు బాలికల తల్లిదండ్రులు నమ్మవద్దు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయించుకుంటే ఎ లాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. క్యాన్సర్‌ నిరోధక వ్యాక్సిన్‌ విధిగా తమ పిల్లలకు వేయించాలి. వ్యాక్సిన్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.

– డాక్టర్‌ రాహుల్‌, డీఎంహెచ్‌ఓ

నల్లగొండ టౌన్‌, కొండమల్లేపల్లి : గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ నిరోధానికి ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ (హెచ్‌పీవీ) వ్యాక్సినేషన్‌లో జిల్లా వెనుకంజలో ఉంది. వ్యాక్సినేషన్‌ ప్రారంభమై మూడు నెలలు కావస్తున్న ఇప్పటివరకు జిల్లాలో 30 శాతమే పూర్తయింది. 14 నుంచి 15 ఏళ్లలోపు వయస్సు కలగిన బాలికలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ ఇస్తోంది. జిల్లా వ్యాప్తంగా 470 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 19,600 మంది 14 నుంచి 15ఏళ్లలోపు బాలికలు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ అంచనాలు వేసింది. వారందరికీ ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేయాల్సి ఉంది. మూడు నెలల క్రితం మహిళా దినోత్సవ సందర్భంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పటివరకు కేవలం 6,000 మంది బాలికలకు మాత్రమే అంటే కేవలం 30.61 శాతమే మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తి చేసింది.

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా పంపిణీ..

జిల్లాలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రితోపాటు మిర్యాలగూడ, దేవరకొండ, నాగార్జునసాగర్‌, నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రులు మర్రిగూడ సీహెచ్‌సీ, 34 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 8 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లలో ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ వేస్తున్నారు. కానీ ఇప్పటివరకు 30.61 ఒక శాతం మాత్రమే వ్యాక్సినేషన్‌ పూర్తి చేశారంటే ప్రజల్లో వైద్య ఆరోగ్య శాఖ ఎలాంటి అవగాహన కల్పిస్తుందో స్పష్టమవుతోంది. మిగతా జిల్లాల్లో 70 నుంచి 80 శాతం వరకు టీకాలు పూర్తి అయినప్పటికీ కేవలం నల్లగొండ జిల్లాలోని 30.61 శాతానికి నమోదు కావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అవగాహన కల్పించడంలో విఫలం

ప్రతి సంవత్సరం చిన్నారుల ఆరోగ్యం కోసం విధిగా నిర్వహించే టీకాల కార్యక్రమంపై వైద్య ఆరోగ్యశాఖ విరివిగా అవగాహన కల్పించాల్సి ఉంది. కానీ రెండేళ్లుగా వైద్య ఆరోగ్యశాఖలో పల్స్‌ పోలియోపై గాని ఇతర టీకాల కార్యక్రమంపై గానీ ప్రజల్లో అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైందనే ఆరోపణలు ఉన్నాయి. కేవలం వచ్చిన బడ్జెట్‌తోనే తూతూ మంత్రంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయడంలో పూర్తిగా విఫలమవుతోంది. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ బయట మార్కెట్‌లో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ధర ఉన్నప్పటికీ ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. అత్యంత ఖరీదైన హెచ్‌పీవీ వ్యాక్సిన్‌పై కూడా బాలికలకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమైందనే విమర్శలు ఉన్నాయి. టీకాలు వేయాల్సిన విభాగం అధికారులు పూర్తిగా నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందనే భావన ప్రజల్లో నెలకొంది.

కొండమల్లేపల్లి కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాలలో వ్యాక్సిన్‌ వేసుకున్న బాలికలు

నల్లగొండలో టీకాలు వేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement