పారదర్శకంగా భూ విలువల సవరణ | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా భూ విలువల సవరణ

May 24 2026 1:57 AM | Updated on May 24 2026 1:57 AM

నల్లగొండ : భూముల విలువల సవరణ ప్రక్రియను పారదర్శకంగా గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. శనివారం హెదరాబాద్‌ నుంచి భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ డీఎస్‌.లోకేష్‌కుమార్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా నుంచి కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం ఇక్కడ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను బట్టి ఎక్కడా ప్రజలకు ఇబ్బంది కలగకుండా, అదే సమయంలో ప్రభుత్వ నిబంధనలకు లోబడి భూ విలువల సవరణ ఉంటుందన్నారు. మే 28 నాటికి విలువల సవరణ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌జే శ్రీనివాస్‌, అధికారులు పాల్గొన్నారు.

జెడ్పీ ఉద్యోగుల బదిలీల షెడ్యూల్‌

నల్లగొండ : నల్లగొండలోని జెడ్పీలో పని చేస్తున్న జూనియర్‌ అసిస్టెంట్లు, టైపిస్టులు, రికార్డు అసిస్టెంట్లు, ఆఫీస్‌ సబార్డినేట్లు, నైట్‌ వాచ్‌మన్ల బదిలీల కౌన్సిలింగ్‌ షెడ్యూల్‌ను జెడ్పీ సీఈఓ ప్రేమ్‌కరణ్‌రెడ్డి శనివారం ప్రకటించారు. ఈ నెల 24న ఆదివారం ఉదయం 10 గంటల నుంచి జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో కౌన్సిలింగ్‌ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

హాస్టల్‌ క్యాటరింగ్‌కు దరఖాస్తులు

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి హాస్టల్‌ క్యాటరింగ్‌ నిర్వహించేందుకు ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ సిహెచ్‌.నర్సింహారావు తెలిపారు. దరఖాస్తు ఫారంలు కళాశాలలో తీసుకోవాలని పేర్కొన్నారు. అర్హులు జూన్‌ 6వ తేదీలోపు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.

రోడ్డు పనులు చేపట్టాలని పాదయాత్ర

మిర్యాలగూడ : మిర్యాలగూడ మండలం గూడూరు నుంచి బోట్యానాయక్‌తండా వరకు ఉన్న గుంతలమయంగా మారిన రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధర్యంలో శనివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భఃగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నడవడానికి కూడా వీలు లేకుండా అత్యంత దారుణంగా గుంతలమయమైన ఈ రోడ్డు మరమ్మతుల పనులు 10వ తేదీలోగా ప్రారంభించకుంటే ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ రోడ్డు నిర్మాణం కోసం టెండర్లు ఖరారైనప్పటికీ.. ఇప్పటివరకు కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లేష్‌, వెంకటేశ్వర్లు, రాగిరెడ్డి మంగారెడ్డి, రవినాయక్‌, పరుశురాములు, మల్లు గౌతంరెడ్డి, నూకల జగదీశ్‌ చంద్ర, సాగర్‌నాయక్‌, శ్రీను, కృష్ణయ్య, పిల్లుట్ల సైదులు, బొంగరాల వెంకటయ్య, మేక రాంబాబు, మంగా, కరీమున్నీసాబేగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement