పెద్దవూర : పెద్దవూర మండల కేంద్రంతో పాటు ఈదులగూడెం, సంగారం గ్రామాల్లో శనివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంలోని వండర్‌కిడ్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ భవనం పైనున్న రేకులు లేచిపోయి పక్కనే ఉన్న గ్రామపంచాయతీ భవనంపై పడ్డాయి. దీంతో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందున్న రేకులు పగిలిపోయాయి. కట్టెబోయిన సైదులు ఇంటిపైకప్పు రేకులు లేచిపోయాయి. ఈదులగూడెం గ్రామానికి చెందిన లింగాల కోటయ్య, గుండెబోయిన రాములుకు చెందిన ఇంటికప్పు రేకులు లేచిపోయాయి. దీంతో ఇంట్లోని సామగ్రి తడిసిపోయింది. సంగారం గ్రామానికి చెందిన కంచర్ల శ్యాంసుందర్ ఇంటి పక్కన ఉన్న మర్రి చెట్టు కూలి ఇంటిపై పడటంతో గోడలు కూలిపోవడంతో పాటు ఇంటిపై కప్పు రేకులు పగిలిపోయి సామగ్రి ధ్వంసమైంది. ఏనేమీదిగూడెం గ్రామంలోని పీర్ల కొట్టం పైకప్పు రేకులు లేచిపోయి సమీపంలో పడిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. సబ్ మార్కెట్ యార్డు సమీపంలో స్తంభం కూలిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


