ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు పాట్లు | - | Sakshi
Sakshi News home page

ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు పాట్లు

May 22 2026 4:46 AM | Updated on May 22 2026 4:46 AM

నల్లగొండ : జిల్లా కేంద్రంలోని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. త్వరలోనే ప్రభుత్వ భూముల విలువలు పెరగనున్నాయనే సమాచారంతో, ధరల భారం తప్పించుకోవడానికి జనాలు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ల కోసం ఎగబడుతున్నారు. రెండు మూడు రోజుల్లోనే కొత్త ధరలు అమలులోకి వచ్చే అవకాశం ఉండటంతో గురువారం జిల్లా కేంద్రంలోని కార్యాలయం కొనుగోలుదారులు, డాక్యుమెంట్‌ రైటర్లతో కిక్కిరిసిపోయింది. ఒకవైపు రద్దీ పెరగడం, మరోవైపు అధికారులు పెరగనున్న ధరల కసరత్తులోనే పూర్తిగా నిమగ్నమవ్వడంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముందస్తుగా స్లాట్‌ బుక్‌ చేసుకుని వచ్చినప్పటికీ.. ఒక్కో రిజిస్ట్రేషన్‌ పూర్తి కావడానికి అమ్మకం, కొనుగోలుదారులు 7 నుంచి 8 గంటల పాటు కార్యాలయంలోనే పడిగాపులు కాయాల్సి వస్తోంది.

సిబ్బంది కొరతతో పనులు ఆలస్యం

ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యమవుతున్నాయి. గత నెలలో విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ తనిఖీల తర్వాత ఇక్కడి నలుగురు అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది కాలపరిమితిని రెన్యువల్‌ చేయకుండా విధులకు దూరం పెట్టారు. మిగతా చోట్ల అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది కొనసాగుతున్నప్పటికీ, నల్లగొండలో మాత్రం వారిని విధుల్లోకి తీసుకోలేదు. దీంతో ఆ అదనపు పనిభారమంతా ఉన్న కొద్దిపాటి సిబ్బందిపైనే పడుతోంది.

తీవ్ర ఎండలు.. కనీస వసతులు కరువు..

గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తున్న తరుణంలో, కార్యాలయంలో కనీస సౌకర్యాలు లేకపోవడం ప్రజల ఇబ్బందులను రెట్టింపు చేస్తోంది. జిల్లాలో ఎండ తీవ్రత 44 డిగ్రీలు దాటడంతో వాతావరణ శాఖ ‘రెడ్‌ అలర్ట్‌’ ప్రకటించింది. పాత మున్సిపల్‌ భవనంలో కొనసాగుతున్న ఈ కార్యాలయంలో ఎండవేడికి జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజుకు వందకు పైగా రిజిస్ట్రేషన్లు జరుగుతూ ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తున్నా, కనీసం తాగడానికి మంచినీటి సౌకర్యం కూడా కల్పించలేదు. మూత్రశాలలు (వాష్‌రూమ్‌లు) లేకపోవడంతో మహిళలు, వృద్ధులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడంపై పెట్టిన శ్రద్ధ, ఆ ఆదాయాన్ని సమకూరుస్తున్న ప్రజలకు కనీస వసతులు కల్పించడంలో పెట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి సిబ్బంది కొరతను తీర్చి, కార్యాలయంలో వసతులు మెరుగుపరచాలని కోరుతున్నారు.

ఫ అమ్మకం, కొనుగోలుదారులతో కిక్కిరిసిన నల్లగొండ

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం

ఫ రిజిస్ట్రేషన్‌కు 7 గంటలకుపైగా నిరీక్షణ

ఫ భూముల విలువ పెరుగుతుందని ముందే వస్తున్న జనం

ఫ సిబ్బంది కొరతతో

రిజిస్ట్రేషన్ల్లలో జాప్యం

ఫ కార్యాలయంలో కనీస వసతులు లేక అల్లాడుతున్న ప్రజలు

Advertisement
 
Advertisement
Advertisement