ఫీజు చెల్లిస్తే.. ప్లాట్‌ ఓకే! | - | Sakshi
Sakshi News home page

ఫీజు చెల్లిస్తే.. ప్లాట్‌ ఓకే!

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు ఇలా..

నల్లగొండ టూటౌన్‌ : మున్సిపల్‌ పట్టణాల్లో అనుమతి తీసుకోకుండా చేసిన వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. జిల్లాలోని నల్లగొండ కార్పొరేషన్‌, మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్‌ మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం చేసుకున్న దరఖాస్తులు 42,681 పెండింగ్‌లో ఉన్నాయి. గతంలోనూ ఎల్‌ఆర్‌ఎస్‌కు అవకాశం ఇచ్చినా చాలా మంది దరఖాస్తుదారులు ముందుకు రాలేదు. ప్రస్తుతం మరోసారి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. మే, జూన్‌ నెలల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజు చెల్లించి తమ ప్లాట్లను క్రమబద్ధీకరించుకోవాలని సూచించింది.

పెండింగ్‌లో భారీగా దరఖాస్తులు..

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో వెయ్యి రూపాయలు చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారి ప్లాట్లను మాత్రమే ప్రస్తుతం ఎల్‌ఆర్‌ఎస్‌కు అనుమతి ఇచ్చారు. నల్లగొండ కార్పొరేషన్‌తో పాటు మిర్యాలగూడ, హాలియా, దేవరకొండ, చండూరు, చిట్యాల, నకిరేకల్‌ మున్సిపాలిటీల్లో ఎల్‌ఆర్‌ఎస్‌ కోసం మొత్తం 74,254 మంది దరఖాస్తులు చేసుకోగా.. 31,033 మంది మాత్రమే ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకున్నారు. ఇంకా 42,681 మంది దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోకపోతే

భారం ఎక్కువే..

అనుమతి లేని ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోకపోతే ఇల్లు కట్టుకునే వారికి భారీగా ఖర్చు కానుంది. మున్సిపాలిటీల్లో అనుమతులు తీసుకోవాలంటే ప్రస్తుతం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఉన్న మార్కెట్‌ ప్రకారం 14 శాతం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌ఆర్‌ఎస్‌ కింద అయితే ప్లాట్‌ కొన్నప్పుడు డాక్యుమెంట్‌పై ఉన్న మార్కెట్‌ విలువ ప్రకారమే ధర ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్‌ ప్రకారం అయితే ఉదాహరణకు 200 గజాలు ఉంటే రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఇంటి అనుమతుల కోసం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. త్వరలోనే భూముల విలువ పెంచే అవకాశం ఉన్నందున ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకోకపోతే ఫీజు మరింత పెరిగే అకాశం ఉంటుంది. చాలా మంది తాము ప్లాట్లు అమ్ముకునే వాళ్లం గనుక ఎల్‌ఆర్‌ఎస్‌ ఎందుకులే అనే దోరణిలో ఉంటున్నట్లు తెలుస్తోంది. మరి ఈ సారైనా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుదారులు ఎల్‌ఆర్‌ఎస్‌ చేయించుకుంటారో లేదో వేచి చూడాలి.

మున్సిపాలిటీలు దరఖాస్తులు క్రమబద్ధీకరణ పెండింగ్‌

నల్లగొండ 36,827 24,554 11,733

మిర్యాలగూడ 14,339 3,117 11,222

హాలియా 4,300 1,200 3,100

దేవరకొండ 5,043 423 4,620

చండూరు 3,400 1,100 2,300

చిట్యాల 3,265 208 3,057

నకిరేకల్‌ 7,080 431 6,649

మొత్తం 74,254 31,033 42,681

ఫ ఎల్‌ఆర్‌ఎస్‌కు మరోసారి అవకాశమిచ్చిన ప్రభుత్వం

ఫ జూన్‌ 30 వరకు గడువు

ఫ పెండింగ్‌ దరఖాస్తులు 42,681

Advertisement
 
Advertisement
Advertisement