నల్లగొండ : పాలిసెట్– 2026 పరీక్షకు అన్ని ఏర్పాటు చేసానట్లు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ అన్నారు. ఆయన నల్లగొండలో మంగళవారం తన చాంబర్‌లో ఆయా శాఖల అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. పాలిసెట్‌కు జిల్లాలో మొత్తం 15 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు 5810 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. పరీక్ష సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అడిషనల్ ఎస్పీ రమేష్‌ను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల పరిధిలో బీఎన్‌ఎస్ 163వ సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జిల్లా కో–ఆర్డినేటర్ సిహెచ్ నరసింహారావు, ఆర్టీసీ, వైద్య ఆరోగ్య, ట్రాన్స్‌కో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నిమిషం ఆలస్యమైనా అనుమతించం
రామగిరి(నల్లగొండ) : పాలిసెట్ ప్రవేశపరీక్ష కేంద్రానికి విద్యార్థులు గంట ముందుగానే చేరుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ సిహెచ్.నర్సింహారావు తెలిపారు. మంగళవారం ఆయన నల్లగొండలో పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరుగుతుందని నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరని తెలిపారు.
హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్‌లో ప్రవేశాలు
నల్లగొండ : హైదరాబాద్ పబ్లిక్ స్కూల్స్ (రామంతపూర్, బేగంపేట)లో 2026–27 విద్యా సంవత్సరంలో 1వ తరగతి డే స్కాలర్స్‌లో గిరిజన విద్యార్థుల ప్రవేశాలకు ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం.శ్రీనివాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నల్లగొండలోని గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం నుంచి ఉచితంగా దరఖాస్తులు తీసుకుని, ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా అదే కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు. అర్హత, ఎంపిక విధానం, పూర్తి వివరాలకు 9515181080 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలని పేర్కొన్నారు.
కంప్యూటర్ శిక్షణకు దరఖాస్తులు
నల్లగొండ : తెలంగాణ ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులకు నిర్వహించనున్న ఉచిత కంప్యూటర్ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఉర్దూ అకాడమీ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ ఇన్‌చార్జి సయ్యద్ యూసుఫ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసే విధానం, అర్హత, ఎంపిక తదితర పూర్తి వివరాల కోసం నల్లగొండలోని ఉర్దూ అకాడమీ ట్రైనింగ్ సెంటర్, లేదా 7989314572 ఫోన్ నంబర్‌ను స్పంప్రదించాలని సూచించారు.
‘సమ్మెకు ప్రభుత్వం దిగివచ్చింది’
నల్లగొండ టౌన్ : ఆర్టీసీ కార్మికుల సమ్మెకు ప్రభుత్వం దిగివచ్చి పలు డిమాండ్లను అంగీకరించిందని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఈదురు వెంకన్న అన్నారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 నుంచి ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేశామని, ఆరు సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ఏప్రిల్ 22న సమ్మె ప్రారంభించామని తెలిపారు. ప్రభుత్వం, యాజమాన్యం స్పందించి చర్చలకు పిలిచి 32 డిమాండ్లను అంగీకరించిందని తెలిపారు. ఆర్టీసీలో యూనియన్ కార్యకలాపాలను కొనసాగించుకోవడానికి ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. సమావేశంలో ఎస్.బాబు , జమాల్, డి.గోపాల్, పాటి అప్పారావు, కేఎస్.రెడ్డి, మనోహర్, బాసాని వెంకటయ్య, పాండురంగయ్య తదితరులు పాల్గొన్నారు.


