కొనుగోళ్లలో కదలిక | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లలో కదలిక

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై జిల్లా యంత్రాంగం కదిలింది. ధాన్యంతో వెళ్లిన లారీలు మిల్లుల వద్ద రోజుల తరబడి దిగుమతి కావడం లేదు. దీంతో కల్లాల వద్ద లారీల కొరత ఏర్పడటంతో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోంది. మరోవైపు అటు నిర్వాహకులు, హమాలీలు, రైతుల నుంచి డబ్బుల వసూళ్లకు పాల్పడుతూ, డబ్బులు ఇస్తేనే తూకం వేసే పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితులపై ‘సాక్షి’ ‘అడుగడుగునా అడ్డంకులు, ఆదేశాలు బేఖాతరు’, ‘లారీలు రావు.. ధాన్యం కదలదు’, ‘డబ్బులిస్తేనే లోడింగ్‌’ శీర్షికలతో వరుస కథనాలను ప్రచురించింది. దీంతో జిల్లా యంత్రాంగం కదిలింది. రవాణాలో అలసత్వం వహించిన నలుగురు లారీ కాంట్రాక్టర్లకు జరిమానా విధించింది. మరోవైపు మిల్లుల వద్ద ధాన్యం దిగుమతులపై కఠిన చర్యలు చేపట్టేలా రంగంలోకి దిగింది.

మిల్లుల్లో కలెక్టర్‌, ఎస్పీ తనిఖీలు

ఈసారి ధాన్యం కొనుగోళ్లలో ప్రధాన సమస్య రవాణా, ధాన్యం దిగుమతి చేసుకోవడమే. దిగుమతుల విషయంలో మిల్లర్లు తాలు పేర కిరికిరి పెడుతూ, వారు సొంతంగా కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి చేసుకుంటూ ప్రభుత్వ కేంద్రాల నుంచి వెళ్లిన ధాన్యాన్ని రోజుల తరబడి దిగుమతి చేసుకోవడం లేదు. దీంతో కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. దీనిపై కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌, అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, పౌరసరఫరాల విభాగం అధికారులు మంగళవారం మిర్యాలగూడ వెళ్లి మిల్లుల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా మిల్లర్లు వారు కొనుగోలు చేసే ధాన్యాన్ని ఆపి, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ముందుగా దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు. వచ్చిన లారీని వచ్చినట్లుగా దిగుమతి చేసుకోవాలని సూచించారు. ప్రతి మిల్లు వద్ద ప్రత్యేక అధికారి, పోలీస్‌ ఇబ్బందిని పెట్టి లారీలు రాగానే దిగుమతి చేసుకునేలా చూడాలని, ఏవైనా ఇబ్బందులు అయితే పైఅధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో మిల్లర్లు జాప్యం చేస్తే కఠిన చర్యలు చేపడతామని కలెక్టర్‌ హెచ్చరించారు.

అధిక సంఖ్యలో లారీల దిగుమతి

కలెక్టర్‌, ఎస్పీలు రంగంలోకి దిగి మిల్లు పరిశీలనకు వెళ్లడంతో ఒక్క రోజే మిల్లుల వద్ద లారీల నుంచి పెద్ద ఎత్తున ధాన్యం దిగుమతి అయింది. మంగళవారం సాయంత్రం వరకు అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి దిగుమతులను పర్యవేక్షించారు. ఒక్కరోజు దాదాపు ఏడు వందల లారీలు దిగుమతి చేయించినట్లు అధికారులు పేర్కొన్నారు. మరో వందకుపైగా లారీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్‌ అయినట్లు తెలిపారు. దిగుమతి అయిన లారీలు వెంటనే ధాన్యం ఎక్కువగా ఉన్న కేంద్రాలకు పంపాలని పౌరసరఫరాల విభాగం అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.

కొనుగోళ్లలో పెరగనున్న వేగం

నెల రోజులుగా ధాన్యం అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిల్లర్ల సహకారం లేక అన్నిచోట్లా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయి. ప్రస్తుతం సమస్యను పరిష్కరించేలా కలెక్టర్‌, ఎస్పీ క్షేత్రస్థాయికి వెళ్లడంతో కొనుగోళ్లలో మరింత వేగం పెరిగే అవకాశం ఉంది.

ఫ ధాన్యం దిగుమతులపై రంగంలోకి దిగిన కలెక్టర్‌, ఎస్పీ

ఫ మిర్యాలగూడలో తనిఖీలు

ఫ ప్రతి మిల్లు వద్ద ఒక అధికారి, పోలీసు సిబ్బంది నియామకం

ఫ ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేయాలని ఆదేశాలు

‘సాక్షి’ వరుస కథనాలతో కదిలిన యంత్రాంగం

Advertisement
 
Advertisement
Advertisement