వానాకాలం సాగుకు
రైతులను సన్నద్ధం చేయాలి
నల్లగొండ : ఉచిత బస్సు పథకం మహిళల్లో ఆర్థిక భరోసానింపిందని కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌లో మహాలక్ష్మి పథకంలో భాగంగా ఉచిత బస్సులో ప్రయాణించిన మహిళలకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. 2023 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది మహిళలు, విద్యార్థినులు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసి రూ.10 వేల కోట్లు, అలాగే జిల్లాలో సుమారు రూ.340 కోట్లు ఆదా చేశారన్నాన్నారు. కార్యక్రమంలో నీలగిరి మేయర్ బుర్రి చైతన్య, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ జానిరెడ్డి, డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి. జిల్లా మహిళా సంక్షేమ అధికారి కృష్ణవేణి, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, సీడీపీఓ హరిత, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిపో మేనేజర్ రమణ, హుస్సేన్, మహిళలు పాల్గొన్నారు.
మహనీయుల జయంతి
ఉత్సవాలకు సహకరించాలి
నల్లగొండ : మహనీయులైన డాక్టర్ బాబుజగ్జీవన్ రామ్, జ్యోతిరావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఈ నెలలో నిర్వహించనున్నందున ప్రతిఒక్కరూ సహకరించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ కోరారు. నల్లగొండ కలెక్టరేట్‌లో మంగళవారం వివిధ సంఘాల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఉత్సవాలను గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్వహించేందుకు సర్కులర్ జారీ చేస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు కోరిక మేరకు ఆయా వర్గాల సమస్యల పరిష్కారానికి అవసరమైతే ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు.
వార్డు సభలకు ఏర్పాట్లు చేయండి
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంగళవారం హైదరాబాద్ నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఏర్పాటు చేసిన వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్న అనంతరం కలెక్టర్ చంద్రశేఖర్ అధికారులతో సమావేశమై మాట్లాడారు. ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, మున్సిపల్ వార్డు సభలకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సభలకు గ్రామ అధికారులంతా తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. సమావేశాల్లో స్థానిక సంస్థల ఇన్‌చార్జి అదనపు కలెక్టర్ వై.అశోక్‌రెడ్డి, అదనపు ఎస్పీ రమేష్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శశికళ, హౌసింగ్ పీడీ రాజ్‌కుమార్, సీపీఓ శ్రీనివాస్ నాయక్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి సంజీవ్, జెడ్పీ సీఈఓ ప్రేమకరణ్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
తిప్పర్తి : వానాకాలం సాగుకు రైతులను సన్నద్ధం చేయాలని కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం తిప్పర్తి మండలం దుప్పలపల్లి గ్రామంలోని రైతు వేదికలో నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నానో యూరియా, డ్రోన్లు, ఆధునిక యంత్రాలను ఉపయోగించి పంటలు సాగుచేసి అధిక దిగుబడులు సాధించేలా రైతులకు అవగాహన కల్పించాలన్నారు. సన్నరకం వరిధాన్యం పండించేలా ప్రోత్సహించాలన్నారు. రైతులను ఉద్యాన పంటల సాగు వైపు మళ్లించి అధిక ఆదాయానిచ్చే పంటలను సాగు చేయించాలన్నారు. రైతులు నకిలీ విత్తనాలుకొని మోసపోకుండా విత్తన వ్యాపారులపై నిఘా పెట్టాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్‌కుమార్, జిల్లా ఉద్యాన శాఖ డీడీ సుభాషిణి, ఏఓ సన్నిరాజు, ఇతర మండలాల ఏఓలు, ఏఈఓలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ చంద్రశేఖర్


