రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

Mar 31 2026 7:20 AM | Updated on Mar 31 2026 7:20 AM

పెద్దఅడిశర్లపల్లి : బైక్‌పై వెళ్తున్న యువకుడిని వెనుక నుంచి కారు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండలం చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లి మండలం అజ్మాపురం గ్రామానికి చెందిన మారుపాకుల చెన్నకేశవులు(29) బోర్‌వెల్‌ బండి నడిపిస్తూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం చెన్నకేశవులు బైక్‌పై అంగడిపేట నుంచి కొండమల్లేపల్లికి వెళ్తుండగా.. మార్గమధ్యలో చిల్కమర్రి గ్రామ స్టేజీ సమీపంలో తన బోర్‌వెల్‌ వాహనం కనిపించడంతో బైక్‌ ఆపి డ్రైవర్‌తో మాట్లాడాడు. అనంతరం బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి కారు వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నకేశవులు తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఆర్టీసీ బస్సు ఢీకొని..

హాలియా : బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన గుర్రంపోడు మండల పరిధిలోని తానేదార్‌పల్లి గ్రామ బస్‌స్టేజీ సమీపంలో సోమవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుడిపల్లి మండలం సింగరాజుపల్లి గ్రామానికి చెందిన వడ్లపల్లి అంజిరెడ్డి(23) బైక్‌పై గుర్రంపోడు నుంచి కొండమల్లేపల్లి వైపు వెళ్తుండగా.. తానేదార్‌పల్లి గ్రామ బస్‌స్టేజీ సమీపంలోకి రాగానే దేవరకొండ నుంచి నల్లగొండకు వెళ్తున్న పల్లెవెలుగు బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంజిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని 108 వాహనంలో దేవరకొండ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి వడ్లపల్లి మణిపాల్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకన్న తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement