మాఫీ రాలే.. వసూలు కాలే! | - | Sakshi
Sakshi News home page

మాఫీ రాలే.. వసూలు కాలే!

Mar 23 2026 9:07 AM | Updated on Mar 23 2026 9:07 AM

నీలగిరిలో రావాల్సింది

రూ.28 కోట్లు

ఆస్తి పన్ను చెల్లించి

అభివృద్ధికి సహకరించాలి

నల్లగొండ టూటౌన్‌ : జిల్లాలోని మున్సిపల్‌ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూలుపై వడ్డీ మాఫీ ఎఫెక్ట్‌ పడుతోంది. నల్లగొండ మున్సిపల్‌ కార్పొరేషన్‌, మిర్యాలగూడ, హాలియా, చండూరు, దేవరకొండ, చిట్యాల, నకిరేకల్‌ మున్సిపల్‌ పట్టణాల్లో ఆస్తి పన్ను బకాయిదారులు వడ్డీ మాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాది మార్చి చివరి వారంలో రాష్ట్ర ప్రభుత్వం 90 శాతం వడ్డీ మాఫీ చేసిన విషయం తెలిసిందే. మూడు నెలల క్రితమే జీహెచ్‌ఎంసీలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించింది. కానీ, జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో బకాయిలపై వడ్డీ మాఫీ చేయకపోవడంతో సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మార్చి చివరి వారం వస్తున్నా నేటికీ వడ్డీ మాఫీ ప్రకటన రాకపోడంతో బకాయిదారులు ఆస్తి పన్ను చెల్లిచడానికి ముందుకు రావడంలేదని అధికారులు చెబుతున్నారు. ఆస్తి పన్ను బకాయిలను చెల్లించాలని స్థానిక అధికారులు, సిబ్బంది ప్రతిరోజు కాలనీల్లో తిరుగుతున్నారు. కానీ బకాయిలతో సహా ఆస్తి పన్ను ముందుగా చెల్లించడం ద్వారా తమకు అన్యాయం జరుగుతుందని పలువురు భవన యాజమానులు చెబుతున్నారు.

50 శాతం కూడా వచ్చే అవకాశం లేదు

ప్రతి సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో మున్సిపాలిటీల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది అందరిని ఆస్తి పన్ను వసూలు కోసం గల్లీ గల్లీ తిప్పుతారు. రాష్ట్ర ప్రభుత్వం వంద శాతం ఆస్తి పన్ను వసూలు చేయాలని టార్గెట్‌ పెట్టినా మార్చి చివరి నాటికి 70 శాతం నుంచి 95 శాతం వరకు వసూలు చేస్తుంటారు. కానీ ఈసారి ఆస్తి పన్ను వసూలు చేయడం అంత సులభం కాదని మున్సిపల్‌ సిబ్బంది చెబుతున్నారు. కనీసం 50 శాతం కూడా వసూలయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను బకాయిలపై 90 శాతం వడ్డీ మాఫీ చేస్తే ఆస్తి పన్ను ఎక్కువగా వసూలయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫ కార్పొరేషన్‌, మున్సిపాలిటీల్లో పన్ను వసూలుపై వడ్డీ మాఫీ ఎఫెక్ట్‌

ఫ జీహెచ్‌ఎంసీలో 90 శాతం వడ్డీ మాఫీ ప్రకటించిన ప్రభుత్వం

ఫ జిల్లాల్లోనూ అమలు చేయాలని ప్రజల నుంచి డిమాండ్‌

ఫ వడ్డీ మాఫీ రాకుండా పన్ను చెల్లింపునకు భవన యజమానుల విముఖత

నీలగిరి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పాత బకాయిలతో కలిపి మొత్తం రూ.28 కోట్లు వసూలు కావాల్సి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.17 కోట్లు వసూలు చేశారు. ఈసారి రూ.19 కోట్లు వసూలు చేస్తేనే 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయి. కానీ ఇప్పటి వరకు రూ.13 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ. 6 కోట్లు వసూలు కావల్సి ఉంది. ఈ పది రోజుల్లో రూ.6 కోట్లు వసూలు అయ్యేది కష్టమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ ఏడాది ఎలాంటి వడ్డీ మాఫీ వచ్చే అవకాశం లేదు. ప్రజలు ఆస్తి పన్ను చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. బకాయిలు చెల్లించకుంటే ఆస్తులు సీజ్‌ చేస్తాం. బకాయిదారులంతా పన్ను చెల్లించాలి.

– శరత్‌చంద్ర, కార్పొరేషన్‌ కమిషనర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement