నకిరేకల్ : కేంద్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న నూతన విత్తన, విద్యుత్, జీరామ్ జీ చట్టాలను రద్దుచేయాలని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండలం వెంకన్న డిమాండ్ చేశారు. ఆదివారం నకిరేకల్‌లోని యానాల మల్లారెడ్డి స్మారక భవనంలో ఆ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పని కల్పించాలని తీసుకొచ్చిన ఉపాధి హమీ పథకాన్ని రద్దు చేయాలనే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందన్నారు. రైతులు, రైతు కూలీలు ఐక్యంగా ఉండి వాటిపై పోరాడాలని కోరారు. ఈ సెమినార్‌లో ఆ సంఘం రాష్ట్ర ఉపాద్యక్షుడు ఎం.డేవిడ్ కుమార్, జిల్లా అద్యక్షుడు జ్వాలా వేంకటేశ్వర్లు, జిల్లా ప్రదాన కార్యదర్శి అంబటి చిరంజీవి, నాయకులు భీరెడ్డి సత్తిరెడ్డి, సిలివేరు జానయ్య, గజ్జి రవి, ముస్కు హనుమంతు, వేముల శంకర్, బురుగు సత్తయ్య, అంబటి కృష్ణమూర్తి, మామిడి ఎల్లయ్య ,వెంకటేశ్వర్లు, సైదులు, వెంకన్న, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ : సామ్రాజ్యవాది అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు వత్తాసు పలకడం భారత ప్రధాని మోదీకి తగదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. ఆదివారం నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ పట్టణంలో నిర్వహించిన సీపీఎం జిల్లా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపే యుద్ధాన్ని ఆపాలంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్‌లో తీర్మానం పెట్టకపోవడం దారుణమన్నారు. యుద్ధాన్ని ఐక్యరాజ్య సమితి వ్యతిరేకించినా ట్రంప్ తన ఆధిపత్య ధోరణి మానుకోకపోవడం ఆయన సామ్రాజ్యవాదానికి నిదర్శనమన్నారు. ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం నిర్వీర్యం చేస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజా ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉందన్నారు. పేదలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు మల్లు లక్ష్మి, తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, చినపాక లక్ష్మీనారాయణ, పాలడుగు నాగా ర్జున, వీరేపల్లి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.


