రాజాపేట : ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటడంతో ఎండిపోతున్న వరి పంటను కాపాడుకునేందుకు రైతులు వాటర్ ట్యాంకర్లతో పొలాలకు నీళ్లు పెడుతున్నారు. రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో ఆదివారం సీపీఐ ఆధ్వర్యంలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా బొందుగుల గ్రామానికి చెందిన రైతు మర్ల నాగరాజు తన పొలానికి వాటర్ ట్యాంకర్‌తో నీళ్లు పెడుతుండటం గమనించారు. నాలుగు ఎకరాలు కౌలు తీసుకుని వరి పంట వేశానని, నీళ్లు లేక పంట ఎండిపోతుందని సదరు రైతు నాగరాజు సీపీఐ నాయకులు తెలిపాడు. నిత్యం ఒక్కో వాటర్ ట్యాంకర్‌కు రూ.1500 చొప్పున చెల్లిస్తూ రోజుకు రెండు ట్యాంకర్ల నీటిని చివరి దశలో ఉన్న తన వరి పొలానికి అందిస్తూ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నానని వివరించాడు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి చిగుళ్ల లింగం తదితరులు పాల్గొన్నారు.


