ఆశావహుల్లో ‘టికెట్’ టెన్షన్
నల్లగొండ టూటౌన్ : నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులకు ‘టికెట్’ టెన్షన్ పట్టుకుంది. ప్రధాన పార్టీల నుంచి టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వారిలో కొందరికి రిజర్వేషన్ కలిసి రాకపోవడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. మరికొందరికి పోటీ తీవ్రస్థాయిలో ఉండడంతో టికెట్ ఎవరికి వస్తుందోననే ఆందోళనలో ఉన్నారు. పక్క వార్డులోకి మారే ప్రయత్నం చేస్తున్నా.. పార్టీ నాయకత్వం వారిని కట్టడి చేస్తున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ కార్పొరేషన్‌లోని 48 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పోటీ చేయడానికి సన్నద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలో ఎక్కువ మందికి టికెట్ల టెన్షన్ పట్టుకుందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. సమీకరణాలు, పార్టీలో పట్టు, ప్రజల్లో మంచి పేరున్న వారికే అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నారు. కానీ పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్లకే ప్రాధాన్యం ఇవ్వాలని కార్యకర్తలు పట్టుపడుతుండడంతో కొన్నిచోట్ల మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా మాజీలకు టికెట్ కట్..
నల్లగొండ కార్పొరేషన్ 48 వార్డులు ఉండగా ఇటీవల రిజర్వేషన్లు మారడంతో చాలామంది పోటీ చేసే అవకాశం కోల్పోయారు. ముఖ్యంగా తాజా మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్‌గౌడ్, మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డితో పాటు పలువురు తాజా మాజీ కౌన్సిలర్లు పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది.
పార్టీ మారుతున్న నాయకులు
టికెట్ రాని కారణంగా 15వ వార్డు కాంగ్రెస్ తాజా మాజీ కౌన్సిలర్ ఏర్పుల తర్షన రవి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా కాంగ్రెస్‌కు చెందిన మరో తాజా మాజీ కౌన్సిలర్ కూడా నేడో రేపో కారు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు. గతంలో బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఏడెనిమిది మందికి టికెట్లు దక్కే అవకాశాలు లేనట్లు తెలిసింది. టికెట్‌లు రానివారు కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచేందుకు సిద్ధం అవుతున్నారు. అలాంటి వారిని కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల నాయకులు బుజ్జగిస్తున్నాయి.
ఫ అన్ని పార్టీల్లోనూ టికెట్ల కోసం తీవ్ర పోటీ
ఫ టికెట్ రాకుంటే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న నాయకులు


