రెండేళ్లకే బదిలీలా..?!
బదిలీలకు అర్హులు వీరే
నల్లగొండ : టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో అధికారులు చేపట్టిన బదిలీలపై ఉద్యోగులు గుస్సా అవుతున్నారు. గతంలో మూడేళ్లు ఒకేచోట పనిచేసే వారికి బదిలీలు తప్పనిసరి చేస్తూ ఉన్న జీవోను రద్దు చేసి.. రెండేళ్లకే బదిలీల ప్రక్రియను చేపడుతూ షెడ్యూల్ విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా సంవత్సరం మధ్యలో బదిలీ చేయడం వల్ల పిల్లల చదువులకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు. కొందరికి అనుకూలమైన వారిని బదిలీ చేయడం కోసం రెండేళ్ల నిబంధనలు తెచ్చి అక్రమాలకు పాల్పడాలని చూస్తున్నారని విద్యుత్ సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే.. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లను బదిలీ చేయాల్సి ఉన్నా.. వారి పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు
బదిలీల షెడ్యూల్ ఇలా..
బదిలీలకు సంబంధించి ఆన్‌లైన్‌లో జాబితా ప్రకటించారు. 23వ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరించనున్నారు. 24 నుంచి 27 వరకు బదిలీలు చేపట్టనున్నారు. 29న బదిలీల ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
50 శాతం పైగానే ఉద్యోగుల బదిలీ
గతంలో మూడు సంవత్సరాలు ఒకేచోట పనిచేసిన ఉద్యోగులకు బదిలీలు తప్పనిసరి చేస్తూ జీఓ ఉంది. దాన్ని రద్దు చేసి రెండేళ్లకే పరిమితం చేయడంతో 50 శాతానికి పైబడి ఉద్యోగులు బదిలీలు కానున్నారు. మూడేళ్ల నిబంధనలో 30 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ చేసేందుకు అవకాశం లేదు. కొత్త నిబంధనలో రెండేళ్ల కుదింపును నిర్ణయించి.. 2026 జనవరి 1నాటికి రెండేళ్లు పూర్తయిన వారికి కటాఫ్ డేట్‌గా ప్రకటించి అందరినీ బదిలీ చేయాలని నిర్ణయించింది. దీంతో 50 శాతం మంది బదిలీ కానున్నారు.
ఆర్టిజన్లను పట్టించుకోని అధికారులు..
టీజీఎస్‌పీడీసీఎల్ పరిధిలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగులకు మాత్రమే బదిలీల షెడ్యూల్ ప్రకటించింది. కానీ ఆర్జిజన్లను మాత్రం పట్టించుకోలేదు. ఆర్టిజన్లను బదిలీ చేయవచ్చని కోర్టుకు చెప్పినా.. అధికారులు ప్రస్తుతం ఈ బదిలీల్లో వారికి చోటు కల్పించలేదు. బదిలీలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్టిజన్లకు అన్యాయం జరుగుతోంది. విషయంలో అధికారులు ఆలోచించి న్యాయం చేయాలని ఆర్టిజన్లు కోరుతున్నారు.
రెండేళ్ల బదిలీ నిబంధన ప్రకారం.. 1 డీఈ, 9 మంది ఏడీఈలు, 19 మంది ఏఈలు వీరందరికి కార్పొరేట్ కార్యాలయంలో బదిలీలు కానున్నాయి. 30 మంది సబ్ ఇంజనీర్లు, 22 మంది జేఏఓలు, 33 మంది ఎస్‌ఏలు, ఆరుగురు ఫోర్‌మెన్లు, ఆరుగురు రికార్డు అసిస్టెంట్లు, 21 మంది అటెండర్లు, ఇద్దరు స్వీపర్లు, ఇద్దరు టెస్టర్లు బదిలీ కానున్నారు.
ఫ టీజీఎస్‌పీడీసీఎల్
నిర్ణయంపై ఉద్యోగుల గుస్సా
ఫ పిల్లల చదువుకు ఇబ్బందులు
ఎదురవుతాయని ఆందోళన
ఫ తమను పట్టించుకోలేదని
ఆర్టిజన్ల ఆవేదన


