పోరాటం చేశాడు.. సర్పంచ్ అయ్యాడు
నిబంధన ఎత్తివేయడంతో సర్పంచ్ అయ్యా
రాజాపేట : స్థానిక సంస్థల ఎన్నికల్లో ముగ్గురు సంతానం నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేయడం వల్లే ప్రస్తుతం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో పారుపల్లి గ్రామ సర్పంచ్‌గా తనకు అవకాశం లభించిందని పారుపల్లి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికైన జ్యోతి తెలిపారు. ముగ్గురు పిల్లలున్న వారు ఎన్నికల్లో పోటీ చేయవద్దనే నిబంధన వల్ల ఎంతోమంది ఎన్నికల్లో పోటీ చేయలేక అనేక అవకాశాలను వదులుకోవాల్సి వచ్చిందని, ప్రస్తుతం ప్రభుత్వం ఈ నిబంధన సడలించడంతో తనతో పాటు చాలా మంది సర్పంచ్‌లుగా పోటీ చేసి గెలుపొందారని పేర్కొన్నారు. తాను సర్పంచ్‌గా గెలుపొందడం సంతోషంగా ఉందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు.
నాల్గవసారి సర్పంచ్‌గా..
చిట్యాల : వెలిమినేడు గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా సీపీఎం బలపర్చిన బొంతల చంద్రారెడ్డి 85 ఏళ్ల వయస్సులో ఘన విజయం సాధించారు. గురువారం జరిగిన ఎన్నికల్లో ఆయన తన సమీప ప్రత్యర్థిపై 307 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆయన ఇదే గ్రామ పంచాయతీకి మూడు పర్యాయాలు పద్నాలుగేళ్ల పాటు సర్పంచ్‌గా పనిచేశారు. ప్రస్తుతం నాలుగోసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
యాదగిరిగుట్ట : ఇద్దరికి మించి సంతానం ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం లేకుండా చేసే నిబంధనను తొలగించాలని డిమాండ్ చేస్తూ పోరాటాలు చేశాడు యాదగిరిగుట్ట మండలం బాహుపేట గ్రామానికి చెందిన కవిడే మహేందర్. ముగ్గురు పిల్లల నిబంధనను రద్దు చేయాలనే డిమాండ్‌తో పోరాట కమిటీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు అభిమాన్ గాంధీనాయక్‌తో కలిసి కవిడె మహేందర్ కూడా అనేక పోరాటాల్లో పాల్గొన్నాడు. మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రాలు అందించాడు. వీరి పోరాటాల ఫలితంగానే ఈ జీఓను రాష్ట్ర కెబినెట్ రద్దు చేసింది. దాంతో మొదటి విడతలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బాహుపేట గ్రామ సర్పంచ్ స్థానానికి కవిడె మహేందర్ బీఆర్‌ఎస్ మద్దతుతో పోటీ చేశాడు. గురువారం జరిగిన పోలింగ్‌లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించాడు. తాను చేసిన పోరాటం ఫలించి బాహుపేట గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యే అవకాశం దక్కించుకున్నాడు మహేందర్.
‘ముగ్గురు సంతానం’ నిబంధనపై పోరాడిన మహేందర్
పోరాటం చేశాడు.. సర్పంచ్ అయ్యాడు
పోరాటం చేశాడు.. సర్పంచ్ అయ్యాడు


