ఇసుకబావిగూడెంలో బీఆర్‌ఎస్ ధర్నా
మాడుగులపల్లి : మండలంలోని ఇసుకబావిగూడెంలో నిర్వహించిన ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించి బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి తంగెళ్ల లలితకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ పోలింగ్ కేంద్రం ఎదుట బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. సాయంత్రం 6.30గంటల నుంచి 11గంటల వరకు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ కొన్ని బ్యాలెట్ పత్రాలపై స్వస్తిక్ ఇంక్ అంటీఅంటనట్లుగా ఉన్నప్పటికీ కాంగ్రెస్ వారికి అనుకూలంగా వ్యవహరించారని.. బీఆర్‌ఎస్ అభ్యర్థికి సంబంధించిన గుర్తుపై ఇంక్ కొంచెం అంటినా.. వాటిని తిరస్కరించడంతో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి ఒక్క ఓటు తేడాతో గెలుపొందారని ఆరోపించారు. అధికారులు రీకౌంటింగ్ చేసి కూడా ఒక్క ఓటు తేడాతో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి గెలుపొందారని ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో న్యాయం చేయాలని ఎంపీడీఓకు వినతిపత్రం సమర్పించారు.
మూడు చోట్ల
సాగని ఎన్నికలు
మాడుగులపల్లి : మండలంలోని అభంగాపురం, అనుముల మండలంలోని పేరూరు సర్పంచ్ స్థానాలు ఎస్టీకి రిజర్వు అయ్యాయి. అక్కడ ఎస్టీలు లేకపోవడంతో ఎవరూ పదవికి సర్పంచ్ నామినేషన్ వేయకపోవడంతో స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు. అదేవిధంగా మాడుగులపల్లి మండలంలోని ఇందుగుల గ్రామంలో ఎస్టీ మహిళ రిజర్వ్ కాగా ఎస్టీ అభ్యర్థి ధీరావత్ కల్పన ఇటీవల హైకోర్టుకు వెళ్లి తనకు ఓటు కల్పించాలని, తన నామినేషన్‌ను అంగీకరించాలని కోరగా హైకోర్టు ఈనెల 15వ తేదీ వరకు గ్రామంలో ఎన్నిక నిర్వహించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. న్యాయ వివాదం కారణంగా ఎన్నిక ఆగింది. ఈ మూడు చోట్ల ఎన్నికలు నిర్వహించలేదు.
పోలింగ్ కేంద్రాల తనిఖీ
హాలియా, మాడుగులపల్లి : అనుముల మండలంలోని ఇబ్రహీంపేట, మాడుగులపల్లి మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను ఎస్పీ శరత చంద్ర పవార్ ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామాల్లో గొడవలు, అల్లర్లు సృష్టించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదన్నారు.
ఇసుకబావిగూడెంలో బీఆర్‌ఎస్ ధర్నా


