
ఎల్లమ్మ తల్లికి మహా మంగళ నిరాజనం
కనగల్ : మండలంలోని ధర్వేశిపురం స్టేజీ వద్ద గల శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు నాగోజు మల్లాచారి ఆధ్వర్యంలో విశేషాలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి మహా మంగళ నిరాజనం హారతులిచ్చి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు.
ఫొటోగ్రఫీ, షార్ట్‌ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం
నల్లగొండ : పోలీసు అమరవీరుల ప్రాణత్యాగాలను స్మరిస్తూ ఈ నెల 21 నుంచి 31 వరకు నిర్వహించనున్న వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహిస్తున్నట్లు ఎస్పీ శరత్‌చంద్రపవార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అత్యవసర సమయాల్లో పోలీసులు స్పందన, ప్రకృతి వైపరిత్యాల్లో పోలీసుల సేవ, వారి కీర్తి ప్రతిష్టలను పెంపొందించే అంశాలకు సంబంధించి 2024 అక్టోబర్ నుంచి ప్రస్తుత అక్టోబర్ వరకు తీసిన మూడు ఫొటోలు, తక్కువ నిడివి (3నిమిషాలు) గల షార్ట్ ఫిలిమ్స్ మాత్రమే ఈ పోటీల నామినేషన్లకు పంపాలని పేర్కొన్నారు. షార్ట్ ఫిలిం లోడ్ చేసిన పెన్ డ్రైవ్, మూడు ఫొటోలను పెన్ డ్రైవ్‌లో సాఫ్ట్ కాపీని ఈ నెల 23వ తేదీలోపు జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఐటీ కోర్ సెక్షన్ విభాగంలో అందజేయాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా పోలీస్ కార్యాలయంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
వందశాతం ఉత్తీర్ణత సాధించాలి
పెద్దవూర : పదో తరగతిలో నూరుశాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి(ఏసీఎంఓ) డివి.నాయక్ అన్నారు. శుక్రవారం పెద్దవూర మండల కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు పట్టికలు, ఫార్మెటీవ్ అసెస్‌మెంట్ పరీక్షల మార్కులను, కంప్యూటర్ ల్యాబ్‌ను పరిశీలించారు. తరగతి గదులకు వెళ్లి విద్యార్థులను పలు అంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. ఉపాధ్యాయులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం డి.బాలోజీ, ఉపాధ్యాయులు కూన్‌రెడ్డి రాంరెడ్డి, బి.కృష్ణ, డి.శ్రీనునాయక్, సంధ్య, షాహీన్‌బేగం, సైదులు, శాంతి, రామయ్య, శివలీల, ఏఎన్‌ఎం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.