
ధాన్యం కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలి
నల్లగొండ : వానాకాలం ధాన్యాన్ని కొనుగోలుకు మిల్లర్లు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వానాకాలం ధాన్యం కొనుగోలుపై సంబంధిత శాఖల అధికారులు, జిల్లా రైస్ మిల్లర్ల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మిల్లులకు పంపించే విధంగా జిల్లా యంత్రాంగం తరఫున అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు అన్ని మండలాల్లో అందుబాటులో ఉండి రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. మిల్లులకు వచ్చిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని మిల్లర్లను కోరారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడంలో ట్రాన్స్‌పోర్ట్ సిబ్బంది ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హమాలీల సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లు 5 రోజుల్లోగా బ్యాంకు గ్యారంటీలు సమర్పించాలని సూచించారు. అనంతరం ధాన్యం మద్దతు ధరపై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, రైస్ మిల్లర్ల ప్రతినిధులు శ్రీనివాస్, నారాయణ, భద్రాద్రి, యాదగిరి, డీఎస్‌ఓ వెంకటేష్, అధికారులు గోపికృష్ణ, శ్రవణ్, ఛాయాదేవి పాల్గొన్నారు.