
న్యాయం జరిగేలా చూస్తాం : ఎస్పీ
పెద్దఅడిశర్లపల్లి : అధిక వడ్డీకి ఆశపడి మోసపోయిన బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. గుడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యాంపును మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులతో ప్రత్యేకంగా సమావేశమై వివరాలు సేకరించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ నిందితుడు బాలాజీనాయక్‌పై డిపాజిట్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. మళ్లీ కస్టడీలోకి తీసుకొని అతడి బంధువులు, బినామీల పేరున ఎలాంటి ఆస్తులు ఉన్నాయనే కోణంలో విచారణ చేసి, ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని వివరించారు. ఇప్పటి వరకు సుమారు 200లకు పైగా ఫిర్యాదులు అందినట్లు వెల్లడించారు. ఈ కేసులో అడిషనల్ ఎస్పీలు రమేష్, మౌనికతో కలిసి మూడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ చేపడుతున్నట్లు తెలిపారు. బాలాజీ ఆస్తులకు సంబంధించిన వివరాలు ఎవరికై నా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎస్పీలు రమేష్, మౌనిక, సీఐ రాజు, ఎస్‌ఐలు ఉన్నారు.