
‘అధిక వడ్డీ’ కేసులో ఇద్దరి అరెస్ట్
కొండమల్లేపలి : అధిక వడ్డీ ఆశచూపి ప్రజలను మోసం చేసిన బాలాజీనాయక్, మధునాయక్‌కు సంబంధించిన ఇద్దరు ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని సోమవారం అర్ధరాత్రి కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ఎస్‌ఐ అజ్మీరా రమేష్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం దేవరకొండ ఏఎస్పీ మౌనిక కొండమల్లేపల్లిలో విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెద్దఅడిశర్లపల్లి మండలం పలుగుతండాకు చెందిన బాలాజీనాయక్, మధునాయక్ ఇద్దరు కలిసి ప్రజల వద్ద అధిక వడ్డీ ఆశ చూపి పలువురి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఈ క్రమంలో బాలాజీనాయక్, మధునాయక్ మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో రమావత్ మధునాయక్ ఒంటరిగానే ఏజెంట్ల ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసే వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. ఈ క్రమంలో అభిషేక్‌నాయక్.. మధునాయక్‌కు ఏజెంట్‌గా వ్యవహరిస్తూ ప్రజల నుంచి దాదాపుగా రూ.4.50 కోట్లు వసూలు చేసి మధునాయక్‌కు ఇచ్చాడు. దీనికి బదులుగా మధునాయక్ నాంపల్లి మండలం దేవత్‌పల్లి గ్రామంలో రూ.7కోట్ల విలువ చేసే 23ఎకరాల 30 గుంటల భూమిని అభిషేక్ నాయక్ పేరిట పట్టా చేయించాడు. ఈ క్రమంలో చందంపేట మండలం బిల్డింగ్‌తండాకు చెందిన మోహనకృష్ణ అనే వ్యక్తి రూ.10 వడ్డీకి రూ.35 లక్షలను అభిషేక్‌నాయక్‌కు ఇచ్చాడు. వడ్డీలు సక్రమంగా ఇవ్వకపోవడంతో మోహనకృష్ణ.. మధునాయక్, అభిషేక్‌నాయక్‌పై కొండమల్లేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో స్థానిక ఎస్‌ఐ అజ్మీరా రమేష్ కేసు నమోదు చేసుకొని మధునాయక్‌కు ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న అభిషేక్‌నాయక్, అతని డ్రైవర్ మహేష్‌ను సోమవారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని విచారించారు. మధునాయక్ పరారీలో ఉన్నాడు. అభిషేక్‌నాయక్‌కు చెందిన రూ.50 లక్షల విలువైన ఫార్చునర్ కారు, ఫోన్‌ను సీజ్ చేశారు. ఫోన్‌లో ఉన్న సమాచారం ప్రకారం ప్రామిసరి నోట్లు, ల్యాండ్ డాక్యుమెంట్లు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. నిందితులను రిమాండ్‌కు తరలించామని తెలిపారు.
వివరాలు వెల్లడించిన ఏఎస్పీ మౌనిక