
నేడు రేషన్ డీలర్ల బైక్ ర్యాలీ
నల్లగొండ : రేషన్ డీలర్లకు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు రావాల్సిన కమిషన్‌ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని సోమవారం నల్లగొండలో శాంతియుత బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు రేషన్ డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి నాగరాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బైక్ ర్యాలీ ఎన్జీ కాలేచి నుంచి ప్రారంభమై కలెక్టరేట్ వరకు సాగుతుందని పేర్కొన్నారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి రేషన్ డీలర్లు అధికసంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు.
మూసీకి కొనసాగుతున్న వరద
కేతేపల్లి : మూిసీ రిజర్వాయర్‌కు వరద కొనసాగుతోంది. మూసీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడంతో ఆదివారం ఇన్‌ఫ్లో తగ్గింది. శనివారం 39 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా.. ఆదివారం 20,936 క్యూసెక్కులకు తగ్గింది. దీంతో ఆరు క్రస్ట్‌గేట్లను మూడు అడుగుల మేర పైకెత్తి 11,231 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ కుడి, ఎడమ కాల్వలకు 185 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
బీసీ రిజర్వేషన్లకు
సీపీఐ మద్దతు
చిట్యాల : స్థానిక సంస్థలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించడానికి సీపీఐ మద్దతిస్తుందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి అన్నారు. చిట్యాలలో ఆదివారం ఆయన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీ జనాభా ప్రాతిపధికను 42 శాతం రిజర్వేషన్ అమలు ప్రక్రియకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినా.. కొందరు కోర్టుకు వెళ్లడం తగదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరగకపోవటంతో గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందని, సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమలకు అనుకూలంగానే ట్రిపుల్ ఆర్ అలాయిమెంట్ మార్చారని ఆరోపించారు. చిట్యాల మండలంలో అక్రమంగా మైనింగ్‌పై ఫిర్యాదు చేస్తున్నా అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. సమావేశంలో ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్‌కుమార్, బొడిగె సైదులుగౌడ్, అక్బర్, జిల్లా సత్యం, షరీఫ్, జిల్లా యాదయ్య, మునుకుంట్ల నాగయ్య, బాలరాజు, లింగయ్య పాల్గొన్నారు.
నృసింహుడి సన్నిధిలో కోలాహలం
యాదగిరిగుట్ట రూరల్: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు, సంప్రదాయ పర్వాలు, భక్తజన సందోహంతో యాదగిరి క్షేత్రంలో కోలాహలం నెలకొంది. ఆదివారం వేకువజామున ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామివారి మేల్కొలుపులో భాగంగా సుప్రభాత సేవ చేపట్టారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీదళాలు అర్పించి సహస్రనామార్చనతో కొలిచారు. ఆ తరువాత ప్రథమ ప్రాకార మండపంలో శ్రీ సుదర్శన నారసింహా హోమం, గజవాహనసేవ, ఉత్సవమూర్తులకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టో త్తర పూజలు గావించారు. సాయంత్రం స్వామి వారికి వెండిజోడు సేవోత్సవం నిర్వహించి భక్తుల మధ్య ఊరేగించారు. వివిధ పూజా కార్యక్రమాల్లో భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. రాత్రి స్వామి వారికి శయనోత్సవం చేసి ఆలయాన్ని ద్వారబంధనం చేశారు.