
సంతానం కలగడం లేదని వివాహిత ఆత్మహత్య
యాదగిరిగుట్ట రూరల్: సంతానం కలగడం లేదని మనోవేదనకు గురైన వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. ఆదివారం యాదగిరిగుట్ట సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరుకు చెందిన గుంటెకాపుల అశ్విని (30)కి యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన కళ్లెపల్లి రాఘవేందర్‌తో 2015లో వివాహం జరిగింది. వివాహం జరిగి పదేళ్లు అవుతున్నా వారికి సంతానం కలుగలేదు. ఈ విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. సంతానం కోసం డాక్టర్లను సంప్రదించినా ఫలితం లేకపోయింది. దీంతో మనోవేదనకు గురైన అశ్విని గతంలో రెండుసార్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ క్రమంలో శనివారం రాత్రి 9గంటల ప్రాంతంలో వంగపల్లిలోని తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించి అశ్వినిని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆమె మృతిచెందిందని వైద్యులు నిర్ధారించారు. మృతురాలి తల్లి గుంటెకాపుల శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు యాదగిరిగుట్ట సీఐ భాస్కర్ తెలిపారు.
సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్‌కు ఉత్తమ అవార్డు
రామగిరి: ఫొటోజెనిక్ ఆర్ట్స్ సర్కిల్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన పోటీల్లో నల్లగొండ సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్ కంది భజరంగ్ ప్రసాద్‌కు ఉత్తమ ఫొటో జర్నలిస్ట్‌గా అవార్డు లభించింది. ఆదివారం ఏపీలోని గుంటూరు జిల్లా మోదుకూరు వేమన సాహిత్య వికాస భవనంలో ఆంధ్ర లయోలా కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సింగారెడ్డి మెల్కియార్, అకాడమీ చైర్మన్ సుధాకర్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్, విజువల్ కమ్యూనికేషన్ హెచ్‌ఓడీ గడ్డం రాయప్ప, పురావస్తు పరిశోధకులు డాక్టర్ ఏమని శివనాగిరెడ్డి చేతులమీదుగా భజరంగ్ ప్రసాద్ అవార్డు అందుకున్నారు.

సంతానం కలగడం లేదని వివాహిత ఆత్మహత్య