
అభివృద్ధి పథంలో సంఘమిత్ర బ్యాంకు
నల్లగొండ టౌన్: సంఘమిత్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారులకు మెరుగైన సేవలు అందిస్తూ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని బ్యాంకు ఫౌండర్ అండ్ చైర్మన్ సంగం రామకృష్ణ అన్నారు. ఆదివారం నల్లగొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన బ్యాంకు 54వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. 1998లో స్థాపించబడిన సంఘమిత్ర కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ఖాతాదారుల సేవే పరమావధిగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతుందన్నారు. 983 మంది వాటాదారులతో రూ.160.35 లక్షల వాటా ధనం కలిగి ఉన్నట్లు తెలిపారు. 3138 మంది ఖాతాదారులతో రూ.90.82 కోట్ల డిపాజిట్లు సేకరించామన్నారు. 4395 మందికి రూ.80 కోట్ల మేర వివిధ రుణాలు ఇచ్చామని పేర్కొన్నారు. మొత్తం వ్యాపారం రూ.170.82 కోట్లకు పైబడి ఉందన్నారు. రూ.1.8 కోట్లతో బ్యాంకు లాభాల బాటలో పయనిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు వైస్ చైర్మన్ సన్నిదానం చక్రపాణి, డైరెక్టర్లు పున చండికేశ్వర్, కొంగరి భిక్షం, గుండ్ల అంజిరెడ్డి, బండ భిక్షంరెడ్డి, ఎర్రమల లక్ష్మీనర్సు, చెరుపల్లి పద్మ, వీరవల్లి భవాని, చంద్రశేఖర్, సీఈఓ వడ్డె శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.