
మార్కెట్‌కు దసరా జోష్
గత నెలతో పోల్చితే ఈ నెలలో కార్ల విక్రయాలు బాగా పెరిగాయి. జీఎస్టీ రేట్ల మా ర్పు, దసరా పండుగ రెండూ కలిసి వచ్చాయి. జీఎస్టీ తగ్గించడంతో ఒక కారుపై సుమారు రూ.40 వేల నుంచి రూ.లక్ష వరకు రేట్లు తగ్గాయి.
– పి.క్రాంతికిరణ్,
హుండాయ్ జనరల్ మేనేజర్
రామగిరి(నల్లగొండ), సూర్యాపేట అర్బన్ : దసరా పండుగ వేళ వివిధ వ్యాపార మార్కెట్లలో సందడి నెలకొంది. ముఖ్యంగా జీఎస్టీ స్లాబ్‌లను కుదించి తాజాగా కొత్త సంస్కరణలు తేవడంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనికితోడు పండుగ సందర్భంగా వివిధ షోరూమ్‌లు, షాపింగ్ మాల్స్ భారీ డిస్కౌంట్లతో ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. దీంతో కొత్త వస్త్రాలు, వాహనాలు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు చేసేందుకు వినియోగదారుల ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఆయా మార్కెట్లలో పండుగ అమ్మకాలు జోరందుకున్నారు.
జీఎస్టీలో రెండు స్లాబ్‌లు..
కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ తగ్గించడంతో పేద, మధ్యతరగతి వర్గాలతోపాటు చిరు ఉద్యోగులకు ఊరట లభించింది. ఇప్పటివరకు 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబ్‌లు అమలులో ఉండగా తాజా సంస్కరణలతో 5, 18 శాతం వరకు ఒకటి, 40 శాతం వరకు రెండో స్లాబ్‌గా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. దీంతో కార్లు, టీవీలు, బైక్‌లు, కుక్కర్లు, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టడంతో వాటి అమ్మకాలు జోరందుకున్నాయి.
ధరల తగ్గుదల ఇలా..
జీఎస్టీ కొత్త స్లాబ్‌లు అమలులోకి రావడంతో వ్యాపారాలు జోరందుకున్నాయి. టీవీలపై గతంలో ఉన్న 28 శాతం జీఎస్టీ నుంచి 18 శాతానికి కుదించడంతో 34 నుంచి 65 ఇంచుల సైజులో ఉన్న టీవీల ధరలు రూ.4వేల నుంచి రూ.6వేల వరకు తగ్గాయి. ఏసీలపై 18 శాతానికి మార్చడంతో టన్నున్నర నుంచి రెండు టన్నుల కెపాసిటీ ఏసీలపై రూ.5వేల నుంచి రూ.9వేల వరకు ధరలు దిగి వచ్చాయి. 12 శాతం ఉన్న ప్రెషర్ కుక్కర్ జీఎస్టీ 5శాతానికి మారడంతో రూ.200 నుంచి రూ.400 వరకు ధరలు తగ్గాయి. ద్విచక్ర వాహనాలపై ఇప్పటి వరకు 28 శాతం జీఎస్టీ ఉండగా ప్రస్తుతం 18 శాతం స్లాబ్‌కు మార్చడంతో 125 సీసీ నుంచి 155 సీసీ వరకు రూ.9వేల నుంచి రూ.17వేల వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో బైక్‌ల కొనుగోళ్లు ఒక్కసారిగా పెరిగాయి. ఇక జీఎస్టీ మార్పుతో చిన్న కార్ల రేట్లు తగ్గించగా, భారీ కార్లు, లగ్జరీ వాహనాలపై పెంచింది. పెట్రోల్, డీజిల్, ఎల్‌పీజీ, సీఎన్‌జీ కార్లపై జీఎస్టీ 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గింది. దీంతో చిన్న కార్ల ధరలు రూ.40 వేల నుంచి రూ.60 వేల వరకు తగ్గాయి. ఎలక్ట్రికల్ వాహనాలకు 5 శాతం పాత జీఎస్టీనే కొనసాగుతోంది. రేట్లు తగ్గడంతో కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా ఈసారి వాహనాల కొనుగోలు పెరిగిందని షోరూమ్ యజమానులు చెబుతున్నారు.
ఆఫర్లు, డిస్కౌంట్లు..
దసరా పండుగ వేళ వివిధ షాపింగ్ మాల్స్, ఆన్‌లైన్ స్టోర్స్ అన్నీ స్పెషల్ క్యాష్‌బ్యాక్ వంటి ఆఫర్లు, డిస్కౌంట్లను ప్రకటించాయి. ఫ్యామిలీ షాపింగ్, పండుగ డెకరేషన్ కోసం కొత్త ఐటెమ్స్‌కు డిమాండ్ బాగా పెరిగింది. మొబైల్స్‌ను ఆన్‌లైన్‌లో ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. పండుగ షాపింగ్‌తో జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో షాపింగ్ మాల్స్ కిక్కిరిసిపోతున్నాయి.
కాస్త ఉపశమనమే..
జీఎస్టీ సంస్కరణలతో కుక్కర్లు, టీవీల ధరలు తగ్గుముఖం పట్టాయి. దీంతో సామాన్యులు సైతం వాటిని సులభంగా కొనుగోలు చేయగలిగే అవకాశం లభించింది. ఈ మార్పు చిరు ఉద్యోగులు, కూలీలు, స్వయం ఉపాధి చేసుకునే వర్గాలకు ఉపశమనమేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. అయితే సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలాలపై మాత్రం 40 శాతం పన్ను కొనసాగింపుపై అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
ఫ జీఎస్టీ స్లాబ్‌ల కుదింపుతో కాస్త తగ్గిన ధరలు
ఫ ఊపందుకున్న వ్యాపారాలు
ఫ పండుగ ఆఫర్లతో పెరిగిన వాహన కొనుగోళ్లు
ఫ తగ్గిన ధరలతో చిరు ఉద్యోగులు, మధ్యతరగతి వర్గాలకు ఊరట

మార్కెట్‌కు దసరా జోష్

మార్కెట్‌కు దసరా జోష్