
రైతుల భూములు లాక్కోవద్దు
నల్లగొండ టౌన్ : రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవద్దని సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమిని కోల్పోతే పరిహారం ఏం ఇస్తారో ఇప్పటికీ చెప్పడం లేదన్నారు. అందుకే భూమిని ఇవ్వడానికి రైతులు సిద్ధంగా లేరని చెప్పారు. రైతుల ఆమోదం లేకుండా భూమిని తీసుకోవడం సరి కాదన్నారు. రైతులకు భూమికి భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు నారి ఐలయ్య, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, ప్రభావతి, చిన్నపాక లక్ష్మీనారాయణ, దండెంపల్లి సత్తయ్య, మల్లం మహేష్, కొండ అనురాధ, రైతులు పాల్గొన్నారు.