
అట్టహాసంగా గృహప్రవేశాలు
కనగల్ : మండల పరిధిలోని తెలకంటిగూడెంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లలోకి రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శనివారం లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయించారు. లబ్ధిదారులకు పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామానికి 107 ఇళ్లు మంజూరు కాగా.. 10 ఇళ్ల నిర్మాణం పూర్తికావడంతో గృహ ప్రవేశం చేశారని మంత్రి తెలిపారు. తేలకంటిగూడెం గ్రామానికి వారం, పది రోజుల్లో రేషన్‌దుకాణం ఏర్పాటు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తేలకంటిగూడెం నుంచి ధర్వేశిపురం కలిపే రహదారి వరకు తారు రోడ్డును రూ.25 కోట్లతో మంజూరు చేశామన్నారు. గ్రామంలో రూ.30 లక్షలతో సీసీ రోడ్లు, ఎల్‌ఈడీ లైట్లు మంజూరు చేశామని తెలిపారు. అనంతరం ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్‌కుమార్, తహసీల్దార్ పద్మ, ఎంపీడీఓ సుమలత, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, కూసుకుంట్ల రాజిరెడ్డి, గుండెబోయిన భిక్షం, బోగారి రాంబాబు, బిల్లపాటి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.