
జోరు వాన.. పారిన వరద
ఫ పొంగిన వాగులు.. నిలిచిన రాకపోకలు
ఫ తిరుమలగిరిలో అత్యధికంగా 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
నల్లగొండ అగ్రికల్చర్ : బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా జిల్లా అంతటా భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు, వంకలు, పొంగిపొర్లడంతో పాటు పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరి, పత్తి చేలల్లో పెద్ద ఎత్తున నీరు నిలిచింది. మరో రెండు రోజులు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో పంట పొలాలకు, పత్తి చేలకు నష్టం వాటిల్లే ప్రమాదం పొంచి ఉంది. జిల్లాలో గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 52.3 మిల్లీమీటర్ల సగటు వర్షం కురిసింది. అత్యధికంగా తిరుమలగిరిసాగర్‌లో 12.5 సెంటీ మీటర్ల వర్షం కురిసింది.
వర్షపాతం ఇలా..
త్రిపురారం మండలంలో 97.1మిల్లీమీటర్లు, పెద్దవూర 86.4, అడవిదేవులపల్లి 83.2, మిర్యాలగూడ 79.9, అనుముల హాలియా 79.8, చిట్యాల 26.8, నార్కట్‌పల్లి 27.3, కట్టంగూర్ 34.7, శాలిగౌరారం 20.2, నకిరేకల్ 35.1, కేతేపల్లి 23.4, తిప్పర్తి 53.3, నల్లగొండ 45.3, కనగల్ 58.0, మునుగోడు 43.7, చండూరు 53.0, మర్రిగూడ 38.3, చింతపల్లి 24.0, నాంపల్లి 36.4, గుర్రంపోడు 59.2, నిడమనూరు 55.4, మాడ్గులపల్లి 61.5, వేములపల్లి 74.5, దామరచర్ల 52.1, పీఏపల్లి 57.3, నేరడుగొమ్ము 39.3, కొండమల్లేపల్లి 59.9, దేవరకొండ, 30.6, గుండ్లపల్లి 34.6, చందంపేట 39.5, గట్టుప్పల్ 26.5, గుడిపల్లి 63.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
పొంగిన వాగులు
పెద్దవూర: మండలంలో గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. మండలం నుంచి ప్రవహించే పెద్దవాగు పొంగి పొర్లింది. పెద్దవూర, పోతునూరు, సంగారం, నాయినివానికుంట, చింతపల్లి, శిర్సనగండ్ల, వెల్మగూడెం తదితర గ్రామాలలోని చెరువులు నిండి అలుగు పోస్తున్నాయి. పలు కల్వర్టు పైనుంచి వరద పొంగిపొర్లడంతో వాహనదారులకు ఇబ్బంది పడ్డారు.
తిరుమలగిరి సాగర్ : వరి చేల మీదుగా ప్రవహిస్తున్న వరద
పెద్దవూర : అలుగు పోస్తున్న పెద్దవూర చెరువు
మూసీ తొమ్మిది గేట్లు ఎత్తివేత
కేతేపల్లి : మూసీ ప్రాజెక్టుకు హైదరాబాద్ నుంచి భారీగా వరద వచ్చే అవకాశాలు ఉండటంతో శుక్రవారం రాత్రి అధికారులు ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తారు. హైదరాబాద్‌లోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలు పూర్తిస్థాయిలో నిండటంతో అక్కడి అధికారులు ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి వరద నీటిని మూసీ నదిలోకి వదిలారు. వరద ఉధృతి భారీగా పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన మూసీ అధికారులు ఏడు క్రస్ట్‌గేట్లను 2 అడుగులు, 2 క్రస్టు గేట్లను 3 అడుగులు(మొత్తం 9గేట్లు) పైకెత్తి 13వేల క్యూసెక్కుల నీటిని దిగువ మూసీకి వదులుతున్నారు. ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వల ద్వారా ఆయకట్టు భూములకు 313 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 645 అడుగులు కాగా 644 మేర అడుగుల మేర నీరు ఉందని అధికారులు తెలిపారు.
అప్రమత్తంగా ఉండాలి: మూసీ గేట్లు ఎత్తి భారీగా వరద నీటిని వదులుతున్న నేపథ్యంలో నల్లగొండ, సూర్యాపేట జిల్లాలోని మూసీ తీర ప్రాంతం వెంట ఉన్న 41 గ్రామాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదల శాఖ సూర్యాపేట డివిజన్–1 ఈఈ వెంకటరమణ సూచించారు. మూసీ వాగు వెంట మోటార్లు అమర్చుకుని వ్యవసాయం చేసుకునే వారు వాటిని తొలగించి ఎగువ ప్రాంతాలకు తరలించుకోవాలన్నారు. గొర్రెల, పశువుల కాపర్లు, రైతులు, జాలర్లు మూసీ వాగులోకి వెళ్లవద్దని సూచించారు.

జోరు వాన.. పారిన వరద

జోరు వాన.. పారిన వరద