
తెలంగాణ వీరవనిత.. చాకలి ఐలమ్మ
నల్లగొండ : తెలంగాణలో తొలి భూ పోరాటానికి నాంది పలికిన వీరవనిత చాకలి ఐలమ్మ అని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. నల్లగొండలోని సాగర్ రోడ్డులో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించి మాట్లాడారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. ఐలమ్మ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని తెలిపారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్‌చంద్ర పవార్, చొల్లేటి ప్రభాకర్, ఇన్‌చార్జి డీఆర్‌ఓ వై.అశోక్ రెడ్డి, గృహ నిర్మాణ పీడీ, బీసీ సంక్షేమ శాఖ ఇన్‌చార్జి అధికారి రాజ్‌కుమార్, బీసీ సంఘాల నాయకులు కొండూరు సత్యనారాయణ, రామరాజు పాల్గొన్నారు.