నల్లగొండ: రేషన్ కార్డుదారులకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక సంచులను అందుబాటులోకి తీసుకొచ్చింది. నల్లగొండ జిల్లాకు 4.65 లక్షల సంచులు కేటటాయించి మండల స్థాయి గోదాములకు పంపించింది. ఈ సంచులను జిల్లాలోని రేషన్ కార్డుదారులకు అక్టోబర్ 1 నుంచి రేషన్ తోపాటు అందజేయనున్నారు. రేషన్ కార్డుపై అందరికీ సన్న బియ్యం–ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యం అనే నినాదంతో ఈ సంచులను ప్రభుత్వం తయారు చేయించింది.
సీసీ కెమెరాలతోనే భద్రత
గుర్రంపోడు : సీసీ కెమెరాలతోనే ప్రజలకు భద్రత పక్కాగా ఉంటుందని, ప్రతి గ్రామంలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ అన్నారు. గురువారం గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో దాతలు, గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీసీ కెమెరాల వల్ల అవాఛంనీయ సంఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. అంతకుముందు ఎస్పీ మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. ఎస్పీ వెంట దేవరకొండ ఏఎస్పీ పి.మౌనిక, సీఐ నవీన్‌కుమార్, ఎస్‌ఐ పసుపులేటి మధు తదితరులు ఉన్నారు.
30 వరకు చేయూత పింఛన్ల పంపిణీ
నల్లగొండ: జిల్లాలో చేయూత పింఛన్ల పంపిణీ గురువారం ప్రారంభమైందని, ఈ నెల 30 తేదీ వరకు లబ్ధిదారులకు అందజేస్తామని డీఆర్‌డీఓ శేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ, చేనేత, కల్లుగీత, ఒంటరి మహిళలకు వారి పరిధిలోని పోస్టాఫీసుల్లో అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రూ.16 చిల్లరతో సహా పింఛన్ మొత్తం అడిగి తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రామకృష్ణ
నల్లగొండ టౌన్ : ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నల్లగొండ పట్టణానికి చెందిన మేడే రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యల పరిస్కారానికి తన వంతుగా కృషి చేస్తానన్నారు. తన ఎన్నికకు సహకరించిన సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కొంపెల్లి భిక్షపతి, అధ్యక్షుడు యానం విజయ్‌కుమార్‌తోపాటు రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సీసీ కెమెరాలతోనే భద్రత