
జల సంరక్షణలో జాతీయ అవార్డు
నల్లగొండ : జల సంరక్షణ– ప్రజల భాగస్వామ్యం (జల్ సంచయ్ ఔర్ జన్ భాగీదారీ) పథకాన్ని పక్కాగా అమలు పర్చినందుకు నల్లగొండ జిల్లాకు కేంద్ర ప్రభుత్వం జాతీయ అవార్డు ప్రకటించింది. మన జిల్లాతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలకు జాతీయ అవార్డు దక్కింది. దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పోటీపడిన జిల్లాల్లో తొలి మూడు స్థానాలను తెలంగాణ జిల్లాలే దక్కించుకోగా ఇందులో నల్లగొండ ఉండడం విశేషం. ఈ పురస్కారం కింద రూ.2 కోట్ల నగదు ప్రోత్సాహకం లభించనుంది. నీటి సంరక్షణ కోసం జిల్లాలో డీఆర్డీఏ ఆధ్వర్యంలో కేంద్రం నిధులతో చెక్ డ్యాములు, పాంపాండ్స్, ఇంకుడు గుంతలు, ఫిష్ పాండ్స్, గుట్టలపై కందకాలు, పార్కులేషన్ ట్యాంకుల నిర్మాణాలు చేపట్టినందుకు ఈ అవార్డు దక్కింది. జాతీయ అవార్డు సాధించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆయా జిల్లాల అధికారులు, ప్రజలను అభినందించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాకు ఇలాంటి అవార్డు రావడం మొదటిసారి అని, ఈ ఘనత ఉపాధి హామీ సిబ్బందికే దక్కుతుందని పేర్కొన్నారు. అధికారులు, సిబ్బంది, ప్రజలకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.