
గులాబీ, హస్తం.. దోస్తీ!
నామినేషన్ వేసిన
అభ్యర్థులంతా పోటీలో..
26న పాలసొసైటీ చైర్మన్లు క్యాంపునకు..
సాక్షి, యాదాద్రి: మదర్ డెయిరీ ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి నెలకొంది.రాష్ట్రంలో కత్తులు దూసుకుంటున్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం ఇక్కడ ఒక్కటయ్యాయి. ఈనెల 27న ఎన్నికలు జరగనున్న మూడు డైరెక్టర్ల స్థానాల్లో రెండు చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు, ఒక చోట బీఆర్‌ఎస్ మద్దతుదారులను గెలిపించుకునేలా ఇరు పార్టీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. బద్ద శత్రువులుగా ఉన్న అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య కుదిరిన ఒప్పందం చర్చనీయాంశంగా మారింది.
బరిలో తొమ్మిది మంది
ఖాళీ అయిన డైరెక్టర్ల స్థానాల్లో మరోసారి తుంగతుర్తి నియోజకవర్గానికి రెండు, నకిరేకల్‌కు ఒకటి దక్కింది. ఈసారి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు అవకాశం లభించలేదు. మూడు డైరెక్టర్ల స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులు ముగ్గురు పోటీ చేస్తున్నారు. వీరితో పాటు మరో ఆరుగురు మొత్తం తొమ్మిది మంది బరిలో ఉన్నారు. ఆరుగురు అభ్యర్థులను బుజ్జగించి పనిలో రెండు పార్టీలు ప్రయత్నిస్తుండగా తాము తప్పుకునేది లేదని వారు పట్టుబడుతున్నారు.
ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే
నకిరేకల్ నియోజకవర్గానికి దక్కిన మహిళా డైరెక్టర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు నలుగురు పోటీ పడుతున్నారు. గంట్ల రాధిక, కర్నాటి జయశ్రీ, మోతె పూలమ్మ, సూధగాని విజయ నామినేషన్‌దాఖలు చేశారు. వారికి ఎన్నికల అధికారులు గుర్తులు కూడా కేటాయించారు. వీరిలో భువనగిరి ఎంపీ, నకిరేకల్ ఎమ్మెల్యేలు వేర్వేరు అభ్యర్థులకు మద్దతు ప్రకటించారు. గుంట్ల రాధికకు ఎంపీ చామలకిరణ్‌కుమార్‌రెడ్డి మద్దతు ఇస్తుండగా, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం కర్నాటి జయశ్రీకి డైరెక్టర్ కోసం పట్టుబడుతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థుల్లో ఎవరికి పార్టీ మద్దతు లభిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది.
రెండు స్థానాలకు ఐదుగురు పోటీ
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని రెండు జనరల్ డైరెక్టర్ స్థానాలకు ఐదుగురు పోటీ పడుతున్నారు. వీరిలో మంచాల ప్రవీణ్‌రెడ్డి, పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి, ఽశీలం వెంకట నర్సింహారెడ్డి, సందిల భాస్కర్‌గౌడ్ పోటీలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ తరఫున మంచాల ప్రవీణ్‌రెడ్డికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్‌తో కుదిరిన ఒప్పందం మేరకు బీఆర్‌ఎస్‌కు ఒక డైరెక్టర్ స్థానాన్ని కాంగ్రెస్ ఒదులుకుంది. మోత్కూరుకు చెందిన రచ్చ లక్ష్మీనరసింహారెడ్డి పేరును బీఆర్‌ఎస్ సూచించింది. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ జోక్యంతో లక్ష్మీనరసింహారెడ్డి పేరు ఖాయం చేశారు. బీఆర్‌ఎస్ తరఫున ఆలేరు నియోజకవర్గం నుంచి సందిల భాస్కర్‌గౌడ్ కోసం ఆ పార్టీ నాయకత్వం చివరి వరకు చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. అయినప్పటికి భాస్కర్ బరిలో ఉన్నారు.
ఆలేరు, భువనగిరి పరిధిలో అత్యధిక ఓట్లు
అత్యధికంగా ఓట్లు ఉన్న ఆలేరు, భువనగిరి నియోజవర్గాల నుంచి తమకు లబ్ది ఓటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే పార్టీ బలపర్చిన అభ్యర్థులకు మద్దతు ఇవ్వాల్సిందేనని కాంగ్రెస్ నాయకుడొకరుచెప్పారు. వ్యతిరేకంగా వ్యవహరిస్తే సస్పెండ్ చేయడానికి వెనుకాడమని మదర్ డైయిరీ చైర్మన్ చెప్పారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీల మద్దతుతో డైరెక్టర్ స్థానాలకు నామినేషన్‌న్ వేసిన వారి పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. ఉపసంహరణ గడువు ముగిసి గుర్తుల కేటాయింపు తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్యన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ముగ్గురు పేర్లు రెండు పార్టీల ప్రతినిధులు ఖరారు చేశారు. నామినేషన్ల ఉపసంహరణకు ముందు ఒప్పందం కుదిరితే పార్టీ నిర్ణయం మేరకు విత్‌డ్రా జరిగేది. ఇప్పుడు ఉపసంహరించుకోవడానికి వీలులేక వారంతా పోటీలోనే ఉన్నారు. గత ఎన్నికల్లో ఆరు డైరెక్టర్ స్థానాలకు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. పోటాపోటీగా క్యాంపులు నిర్వహించాయి. అయితే చివరికి కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఈ సారి కూడా పోటీకి రెండు పార్టీలు సిద్ధపడ్డాయి. దీంతో పూర్తిస్థాయిలో విత్ డ్రాల కోసం ప్రయత్నించలేదు. అయితే ఓటింగ్‌కంటే ముందే పరస్పరం ఒప్పందం చేసుకున్నాయి.
మదర్ డెయిరీ ఎన్నికల్లో కుదిరిన ఒప్పందం
ఫ మూడు డైరెక్టర్ స్థానాల పంపకం
ఫ కాంగ్రెస్ మద్దతుదారులకు రెండు, బీఆర్‌ఎస్ మద్దతుదారులకు ఒకటి
ఫ 27వ తేదీన పోలింగ్
ఫ బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు
మదర్‌డైయిరీ పాలకవర్గం డైరెక్టర్ల స్థానాలకు ఈనెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. అదే రోజు ఓట్ల లెక్కించి విజేతలను ప్రకటించనున్నారు. ఒప్పందం కుదిరినప్పటికీ ఇరు పార్టీలు పాల సొసైటీ చైర్మన్లను 26వ తేదీన క్యాంపునకు తరలించేందుకు సిద్ధమవుతున్నాయి. పాల సొసైటీల్లో వివిధ పార్టీలకు చెందిన చైర్మన్లు ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మద్దతుదారులు కాకుండా పోటీలో ఉన్న మరో ఆరుగు అభ్యర్థులు ఓట్లు రాబట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో ఉన్న పెద్దిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోటీలో ఉంటానని ప్రకటించారు. ఇంకా మోతె పూలమ్మ, శీలం వెంకట నర్సింహరెడ్డి బరిలో ఉన్నారు.