
జెడ్పీ చైర్మన్ పీఠం ఎస్సీ రిజర్వ్?
నల్లగొండ : నల్లగొండ జెడ్పీ చైర్మన్ స్థానం ఎస్సీలకు రిజర్వ్ అయినట్లు తెలుస్తోంది. జిల్లా పరిషత్ చైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలోనే ఖరారు చేశారు. రొటేషన్ పద్ధతిలో ఈసారి నల్లగొండ స్థానం ఎస్సీలకు రిజర్వ్ చేసినట్లు సంబంధిత అధికారుల ద్వారా తెలిసింది. మరోవైపు ప్రభుత్వ ఆదేశానుసారం జెడ్పీటీసీ, ఎంపీపీతో పాటు ఎంపీటీసీల రిజర్వేషన్లను జిల్లా యంత్రాంగం పూర్తి చేసింది. అదే విధంగా పంచాయతీ, వార్డుల వారీ రిజర్వేషన్ల జాబితాను కూడా సిద్ధం చేసింది. ఎంపీపీ, జెడ్పీటీసీల రిజర్వేషన్ జాబితాను జెడ్పీ అధికారులు కలెక్టర్‌కు అందజేశారు. ఎంపీటీసీల రిజర్వేషన్ల జాబితాను బుధవారం ఆర్డీఓలు సీల్డ్ కవర్‌లో కలెక్టర్‌కు సమర్పించారు. ఆయా జాబితాను ఆమోదం నిమిత్తం కలెక్టర్ ప్రభుత్వానికి పంపనున్నారు.
పెరిగిన బీసీ స్థానాలు
మంగళవారం జెడ్పీటీసీ, ఎంపీపీల రిజర్వేషన్ల ప్రక్రియను జిల్లా అధికారులు పూర్తి చేయగా.. బుధవారం ఎంపీటీసీల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. జిల్లాలో 33 చొప్పున ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలుండగా అందులో ఎస్సీ, ఎస్టీలకు పాత పద్ధతిలోనే (ఎస్సీలకు 6, ఎస్టీలకు 5) రిజర్వేషన్ చేశారు. బీసీలకు మాత్రం గతంలో 4 స్థానాలు ఉండగా.. ఈసారి 42 శాతం రిజర్వేషన్ ప్రకారం అవి 14 స్థానాలకు పెరగనున్నాయి. దీంతో బీసీలకు అదనంగా 10 జెడ్పీటీసీ, 10 ఎంపీపీ స్థానాలు దక్కనున్నాయి. 16 చొప్పున ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలు వారికి దక్కుతాయి. మిగిలిన సీట్లు అన్ రిజర్వుడు కేటగిరిగా పరిగణిస్తారు.
బీసీలకు 148 ఎంపీటీసీలు రిజర్వ్
బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు అవుతుండటంతో ఎంపీటీసీ స్థానాలు కూడా బీసీలకు పెద్ద ఎత్తున రిజర్వ్ అయ్యాయి. గత 2019 ఎన్నికల్లో 349 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో ఎస్టీలకు 52, ఎస్సీలకు 61, బీసీలకు 50 సీట్లు కేటాయించి 186 సీట్లు అన్ రిజర్వుడుగా ప్రకటించారు. ఇప్పుడు 4 ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి. దాంతో ఎంపీటీసీల సంఖ్య 353కు చేరింది. ఈసారి ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు యథావిదిగానే ఉంటాయి. బీసీలకు మాత్రం 148 స్థానాలు దక్కనున్నాయి. అంటే గతంలో కంటే 98 సీట్లు బీసీలకు అధికంగా రిజర్వ్ కానున్నాయి. అన్ని కేటగిరీల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ అమలు చేస్తారు. అయితే ఈ రిజర్వేషన్ల ప్రక్రియ అంతా జిల్లా స్థాయిలో ఖరాారు చేసి.. కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపనున్నారు. జీఓ విడుదలయ్యే వరకు ఈ వివరాలను గోప్యంగా ఉంచనున్నారు.
ఫ ఖరారైన జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల రిజర్వేషన్లు
ఫ కలెక్టర్ వద్దకు చేరిన జాబితాలు
ఫ ప్రభుత్వం నుంచి జీఓ వచ్చాక ప్రకటించే అవకాశం
ఫ రాష్ట్రస్థాయిలోనే జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్