
మీరే నా బలం... బలగం
నల్లగొండ: మీరే నా లీడర్లు... మీరే నా క్యాడర్... మీరే నా బలం... బలగం. నన్ను 30 ఏళ్లుగా అక్కున చేర్చుకున్నారు. ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిది అని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం నల్లగొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం పట్టణంలోని ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ అంటేనే కాంగ్రెస్ పార్టీకి అడ్డాగా నిలిచిందన్నారు. అభివృద్ధిలో నల్లగొండను ఆదర్శంగా నిలుపుతామన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేర్చే బాధ్యత కాంగ్రెస్ కార్యకర్తలపై ఉందన్నారు. గ్రామీణ రోడ్లన్నీ డబుల్ రోడ్లుగా మారుస్తానని విద్య వైద్యంలో మెరుగైన సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. రోడ్లు, కాల్వలు, కాలేజీలు, ఆసుపత్రి, ప్రాజెక్టులు ఏది చూసినా నల్లగొండ మోడల్‌గా నిలిచే విధంగా చేస్తామన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 100 శాతం కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ నాలుగు ముక్కలైందని అది మునిగిపోయే నావ అని ఏనాడో చెప్పానన్నారు. జిల్లాలో ఓ లీల్లీపుట్ ఉండు. ఎప్పుడు గెలిచినా ఆయనకు 2వేల లోపే మెజార్టీ అని భవిష్యత్‌లో ఇక గెలవడన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమన్నారు. శ్రీశైలం ఎడమగట్టు సొరంగాన్ని (ఎస్‌ఎల్‌బీసీని) నూతన టెక్నాలజీతో 2027లోపు పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఎస్‌ఎల్‌బీసీ పూర్తయితే జిల్లా సశ్యశ్యామలం అవుతుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుమ్మల మోహన్‌రెడ్డి, గడ్డం అనూప్‌రెడ్డి, జూకూరి రమేష్, సంపత్‌రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, సైదులు, అబ్బగోని రమేష్‌గౌడ్, కూసుకుంట్ల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఫ కాంగ్రెస్ పార్టీకి అడ్డా.. నల్లగొండ
ఫ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలి
ఫ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి