
తెలంగాణలో ప్రతిపక్షం కరువైంది
మునుగోడు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోసాలు, అవినీతి, అక్రమాలను ఎండగట్టేందుకు అవసరమైన ప్రతిపక్ష పార్టీ రాష్ట్రంలో కరువైందని, అందువల్లే సీఎం రేవంత్‌రెడ్డి తన ఇష్టానుసారంగా పరిపాలన కొనసాగిస్తున్నాడని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల పింఛన్ రూ.6 వేలు, వృద్ధులు, వితంతువులు ఇతర పింఛన్‌దారులకు రూ.4 వేలు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎమ్మార్‌పీఎస్ ఆధ్వర్యంలో మునుగోడులో నిర్వహించిన సభకు ఆయన హాజరై మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45 లక్షల మంది పింఛన్‌దారులకు పింఛన్ పెంచుతామని మాట ఇచ్చి 21 నెలల కాలంగా పెంచకుండా మోసపూరిత పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఇలా ఇచ్చిన హామీని అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ ప్రశ్నించకపోగా 21 నెలల కాలంగా అసెంబ్లీకి, ప్రజల్లోకి రాకుండా అసమర్థ ప్రతిపక్ష నేతగా మిగిలాడన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, కేసీఆర్ పేద కుటుంబాలకు చెందినవారైతే పింఛన్‌దారులపై వారికి జాలి, దయ కలిగేదన్నారు. తాను పేద కుటుంబంలో జన్మించి రిక్షా తొక్కి, ఆ తరువాత ఆటో, ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసి పేదరికలో పెరిగి ఎదిగినవాడినని.. అందుకే పింఛన్‌దారుల కోసం పోరాడుతున్నాని చెప్పారు. 2003 నుంచి గుండెజబ్బు కలిగిన పేదల బిడ్డలకు ఉచితంగా ఆపరేషన్లు చేయాలని తమ సంఘం ద్వారా పోరాడితే అప్పటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తాను 2004లో అధికారంలోకి వచ్చాక పేదలు అందరికీ ఆరోగ్యశ్రీ పథకం అందించారని గుర్తుచేశాడు. అంతే కాకుండా వికలాంగుల, వృద్ధుల పింఛన్ పెంపు కోసం 2007 నుంచి ఎమ్మార్పీఎస్ ఆందోళనలు చేపడుతుంటే రూ.75 ఉన్న పింఛన్ రూ.4 వేలకు చేరిందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం పింఛన్లు పెంచాలని అక్టోబర్ 6 నుంచి నవంబర్ 6 వరకు తహసీల్దార్ కార్యాలయాల ఎదుట రిలే దీక్షలు చేపడుతామన్నారు. నవంబర్ 20న 20 లక్షల మందితో చలో హైదరబాద్ చేపడుతామన్నారు. ఈ సభలో వికలాంగుల సంఘం నాయకులు మత్స్యగిరి, తలారి సహదేవులు, మేతరి రాములు, శోభ, లింగయ్య, ఎమ్మార్పీస్ నియోజకవర్గ ఇన్‌చార్జి మేడి శంకర్, జిల్లా నాయకులు పందుల మల్లేష్, సంపత్‌కుమార్, పందుల అంజి, వెంకన్న, యాదయ్య, లక్ష్మణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ