
పెరిగిన యూరియా వినియోగం
ఎకరానికి 2 బస్తాల యూరియా వినియోగించాల్సి ఉన్నా..
అవసరం మేరకే కొనాలి
నల్లగొండ అగ్రికల్చర్: జిల్లాలో రైతులు యూరియా వినియోగాన్ని పెంచారు. వానాకాలం సీజన్‌కు జిల్లాకు 70వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని జిల్లా వ్యవసాయ శాఖ అంచనాలు వేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. దాని ప్రకారంగా జిల్లాకు మూడు నెలల్లో 67,500 మెట్రిక్ టన్నుల యూరియాను ప్రభుత్వం సరఫరా చేసింది. ఇంకా జిల్లాకు 2500 మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. అయితే జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5,64,585 ఎకరాల్లో పత్తి, 5,05,160 ఎకరాల్లో వరి, కంది, జొన్న, పెసర, వేరుశనగ ఇతర పంటలు కలిపి మొత్తం 10,73,162 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. సాగు చేసిన లెక్కల ప్రకారం ఎకరానికి రెండు బస్తాల యూరియా చొప్పున వాడినా మొత్తం 43 వేల మెట్రిక్ టన్నులతో పాటు ఇతర పండ్ల తోటలు, కూరగాయల సాగుకు మరో 10 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైనా మొత్తం 53వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని వ్యవసాయశాఖ అంచనాలు వేసి అదనంగా యూరియాను కూడా ఉండాలనే ఉద్దేశ్యంతో 70 వేల మెట్రిక్ టన్నులు అవసరంగా అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించింది. ఇప్పటికే 67,500 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చినప్పటికీ యూరియా కోసం రైతులు బారులుదీరుతున్నారు. నాన్ ఆయకట్టు ప్రాంతంలో జూలై మొదటి వారంలోనే వర్షాలు కురవడంతో పత్తి గింజలను పెట్టుకున్నారు. అదేవిధంగా బోరు బావుల కింద వరినాట్లు కూడా వేసుకున్నారు. జూలై, ఆగస్టు మాసాల్లో జిల్లాకు వచ్చిన యూరియా నాన్ ఆయకట్టు ప్రాంతంలోని రైతులకు సరిపోయింది. ఆగస్టులో నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటి విడుదల చేయడం, వర్షాలు సమృద్ధిగా కురవడంతో ఆయకట్టులో ఒకే సారి వరినాట్లు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో యూరియా డిమాండ్ బాగా పెరిగి రైతులు యూరియా కోసం బారులుదీరుతున్నారు. సెప్టెంబర్‌లో ప్రతిరోజు జిల్లాకు యూరియా దిగుమతి అయినప్పటికీ యూరియా వినియోగం పెరిగి రైతులు పెద్దఎత్తున ఆందోళనలు చేశారు.
ప్రైవేట్ వ్యాపారుల కృత్రిమ కొరత
జిల్లాలోని కొందరు ప్రైవేట్ వ్యాపారులు యూరియా కృత్రిమ కొరతను సృషించి రైతులకు ఎక్కువ ధరకు విక్రయించారు. యూరియా 60 శాతం ప్రభుత్వ కేంద్రాలకు 40 శాతం యూరియాను ప్రైవేట్ వ్యాపారులకు కేటాయిస్తారు. ప్రభుత్వ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరగా ప్రైవేట్ దుకాణాల వద్ద అంతగా రైతులు బారులుదీరలేదు. కేవలం వారి రెగ్యులర్ రైతులకు మాత్రం రూ.400ల నుంచి రూ.450 వరకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.
వరికి ఎకరానికి 2 బస్తాల యూరియా వినియోగించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నప్పటికీ రైతులు ఏకంగా ఎకరానికి 4 నుంచి 5 బస్తాల యూరియాను వినియోగించినట్లు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీనికి తోడు కొందరు రైతులు ముందస్తుగా వచ్చే సీజన్‌కు కూడా కొనుగోలు చేసి సిద్ధంగా ఉంచుకుంటున్నట్లు సమాచారం. దీంతో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
యూరియాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. రైతులు అవసరం మేరకు మాత్రమే కొనుగోలు చేయాలి. ఎక్కువ మొతాదులో యూరియా వాడితే పంటకు నష్టమే కాని లాభం ఉండదు. నిల్వ ఉంచుకుంటే యూరియా పనికిరాదు.
– పాల్వాయి శ్రవన్‌కుమార్, డీఏఓ
ఫ మోతాదుకు మించి వాడిన రైతులు
ఫ 70వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేసిన
వ్యవసాయ శాఖ
ఫ మూడు నెలల్లో 67,500 మెట్రిక్ టన్నులు సరఫరా
ఫ అయినా యూరియా కోసం బారులుదీరుతున్న రైతులు

పెరిగిన యూరియా వినియోగం