
16.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు
● అత్యధికంగా గుర్రంపోడు మండలంలో 43.2 మిల్లీమీటర్లు
నల్లగొండ అగ్రికల్చర్: జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 16.9 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా గుర్రంపోడు మండలంలో 43.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నార్కట్‌పల్లిలో 41.3, మర్రిగూడ 35.8, వేములపల్లి 34.8, తిప్పర్తి 30.7, నల్లగొండ 30.1, మునుగోడు 32.6, మిర్యాలగూడ 30.9, చందంపేట 26.4, కట్టంగూర్ 22.4, చింతపల్లి 21.1, గట్టుప్పల్ 19.3, మాడ్గులపల్లి 19.9, కేతేపల్లి 18.8, దేవరకొండ 15.3, త్రిపురారం 15.6, నకిరేకల్ 14.2, తిరుమలగిరి సాగర్ 13.5, చిట్యాలలో 13.5, నిడమనూరు 13.0, శాలిగౌరారం 10.6, మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
నేడు నల్లగొండకు
మంత్రి కోమటిరెడ్డి రాక
నల్లగొండ: నల్లగొండకు మంగళవారం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి రానున్నారు. హైదరాబాద్ నుంచి బయల్దేరి మంగళవారం ఉదయం 10 గంటలకు నల్లగొండలోని మంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకోనున్నారు. అనంతరం మర్రిగూడ బైపాస్‌లోని ఎంఎన్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించనున్న నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు వెళ్లనున్నారు.
నేడు మునుగోడుకు
మంద కృష్ణ
మునుగోడు: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పెంఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఎంఆర్‌పీఎస్ ఆధ్వర్యంలో మునుగోడులో నిర్వహించే సభకు మంద కృష్ణ మాదిగ హాజరుకానున్నట్లు ఆ సంఘం నియోజకవర్గ ఇన్‌చార్జ్ మేడి శంకర్ తెలిపారు. సోమవారం మునుగోడులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కుల సాధనకు నిర్వహించే సభకు మండలంలోని అన్ని రకాల పెన్షన్ దారులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో సంఘం నాయకులు పందుల మల్లేష్, పందుల సంపత్ కుమార్, వెంకన్న, బోయపర్తి యాదయ్య, ఎర్రసాని గోపాల్, పందుల పర్వతాలు, పోలే రాజు, పరమేష్, శ్రీను, వికలాంగుల హక్కుల పోరాట సమితి దొమ్మాటి సత్యనారాయణ పాల్గొన్నారు.
భూసేకరణ పూర్తిచేయాలి
నల్లగొండ: జాతీయ రహదారుల నిర్మాణంలో భాగంగా మిగిలిపోయిన భూ సేకరణ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశమయ్యారు. దసరా పండుగకు ముందే అన్ని జాతీయ రహదారుల భూ సేకరణ పనులు పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. టైటిల్ సమస్యలు ఉన్న భూముల విషయంలో పరిహారం మొత్తాన్ని డిపాజిట్ చేసి, భూములను సేకరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రహదారి నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా ప్రతి కేసును అత్యంత ప్రాధాన్యంగా పరిగణించాలన్నారు. సమావేశంలో డీఆర్‌ఓ అశోక్ రెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ శ్రీధర్ రెడ్డి, జాతీయ రహదారుల సంస్థ ఈఈ మురళి పాల్గొన్నారు.
ఆర్డీఓ అశోక్‌రెడ్డికి
ఇన్‌చార్జ్ సీపీఓ బాధ్యతలు
నల్లగొండ: నల్లగొండ ఆర్డీఓ అశోక్ రెడ్డికి జిల్లా ప్లానింగ్ అధికారిగా ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగిస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ పనిచేస్తున్న సీపీఓ సుబ్బారావు పదవీ విరమణ పొందడంతో సూర్యాపేట సీపీఓకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన నల్లగొండకు సక్రమంగా రాకపోవడంతో సీపీఓ ఇన్‌చార్జ్ బాధ్యతలను నల్లగొండ ఆర్డీఓకు అప్పగించినట్లు కలెక్టర్ తెలిపారు.