
స్కూల్ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు
13 బృందాల ఏర్పాటు
ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఇటీవల జరిగిన స్కూల్ బస్ ప్రమాదాల్లో ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడి తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలింది. పది రోజుల వ్యవధిలో రెండు స్కూల్ బస్‌ల కింద ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో జిల్లాలో సంచలనం సృష్టించింది. దీంతో ప్రమాదాల నివారణకు రవాణా శాఖ శ్రీకారం చుట్టింది. స్కూల్ బస్సులకు ప్రాక్సిమిటీ మిర్రర్లు (కుంభాకార దర్పణాలు) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. స్కూల్ బస్సు 360 డిగ్రీల్లో కనిపించేలా అద్దాలు బిగించుకోవాలని రవాణా శాఖ పాఠశాలల యాజమాన్యాలను ఆదేశించింది.
బస్సు పూర్తిగా కనిపించేలా..
ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి స్కూల్ బస్‌కు కుడి, ఎడమ పక్కన, ముందుభాగం, వెనుక భాగం కనిపించేలా ప్రాక్సిమిటీ మిర్రర్లను ఏర్పాటు చేయాలని రవాణాశాఖ నిర్ణయించింది. బస్సులకు ముందు భాగంగా సైడ్‌కు ఉండే ఈ అద్దాల్లో బస్‌కు ఉన్న చక్రాలు, బంపర్, రోడ్డు అంతా కనిపిస్తుంది. దాంతో అక్కడకు పిల్లలు వస్తే డ్రైవర్‌కు అద్దంలో చూస్తే కనిపిస్తుంది. డ్రైవింగ్ సీటుకు ముందు బస్ బయట నుంచి పెద్ద మిర్రర్‌ను ఏర్పాటు చేస్తారు. దాని ద్వారా బస్ ముందు ఎవరైనా చిన్న పిల్లలు వెళ్లినా అద్దంలో నుంచి డ్రైవర్‌కు కనిపిస్తుంది.
నెల రోజుల్లో ఏర్పాటు చేయాల్సిందే..
ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,649 స్కూల్ బస్సులు ఉండగా, అందులో కాలం చెల్లినవి, మరో ఒకటీ రెండు నెలల్లో కాలం చెల్లే బస్సులు, మూసివేసిన పాఠశాలలకు చెందినవి 54 ఉన్నాయి. వాటిని మినహాయించి మిగతా 1,595 స్కూల్ బస్‌లకు ప్రాక్సిమిటీ మిర్రర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. అందులో నల్లగొండ జిల్లాలో 699, సూర్యాపేట జిల్లాలో 522, యాదాద్రి భువనగిరి జిల్లాలో 337 ఉన్నాయి. వీటికి నెల రోజుల్లోగా ప్రత్యేకంగా ఆయా అద్దాలను బిగించాలని రవాణ శాఖ ఆయా పాఠశాలల యజమానులకు ఆదేశాలు జారీ చేసింది. రెండురోజుల కిందట ఆయా యాజమాన్యాలతో సమావేశం నిర్వహించి మరీ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు నల్లగొండ ఎంవీఐ లావణ్య తెలిపారు. ఇటీవల నల్లగొండ జిల్లాలో జరిగిన రెండు సంఘటనల్లోనూ ప్రమాదానికి కారణమైన బస్సులకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు ఉన్నాయని వెల్లడించారు.
స్కూల్ బస్‌లను ఎప్పటికప్పుడు ఫిట్‌నెస్‌తో పాటు మిర్రర్లు అన్ని సక్రమంగా ఉన్నాయా లేవా అనే విషయాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేసేందుకు రవాణ శాఖ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శిక్షణ కోసం వచ్చిన ఎంవీఐలు, స్థానిక రవాణా శాఖ సిబ్బందితో కలిపి 13 బృందాలను రవాణ శాఖ ఏర్పాటు చేసింది.
స్కూల్ బస్సుల వల్ల పిల్లలు ప్రమాదాల బారిన పడకుండా ప్రత్యేక దృష్టి పెట్టాం. ఎంతో విలువైన పిల్లల ప్రాణాలను కాపాడేందుకు, ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేకంగా అద్దాలను బిగించేలా చర్యలు చేపడుతున్నాం. బస్సు చుట్టూ అన్ని వైపులా కనిపించేలా, పిల్లలు పూర్తిగా బస్సుకు దూరంగా వెళ్లారా? లేదా? అన్నది డ్రైవర్ ఆయా అద్దాల్లో చూసుకొని వెళ్లేలా చర్యలు చేపడుతున్నాం.
– వాణి, ట్రాన్స్‌పోర్ట్ డిప్యూటీ కమిషనర్
బస్సు 360 డిగ్రీల్లో కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు
ఫ ఇటీవల జిల్లాలో స్కూల్ బస్సుల కింద పడి ఇద్దరు చిన్నారులు మృత్యువాత
ఫ ప్రమాదాల నివారణ పై దృష్టిపెట్టిన రవాణా శాఖ యంత్రాంగం
ఫ నెల రోజుల్లోగా మిర్రర్లు ఏర్పాటు చేయాలని ఆదేశం
ఫ బస్సుల ఫిట్‌నెస్, ఇతర అంశాలపై తనిఖీలకు ప్రత్యేక బృందాల ఏర్పాటు