
ఓపెన్ అడ్మిషన్లకు 26 వరకు గడువు
రామగిరి(నల్లగొండ) : డాక్టర్ బిఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఈ విద్యా సంవత్సరానికి డిగ్రీ, పీజీ కోర్సుల్లో చేరేందుకు విద్యార్థుల నుంచి అపూర్వ స్పందన వస్తోందని.. అడ్మిషన్ల ప్రక్రియ గడువు ఈ నెల 26వ తేదీ పొడిగించామని యూనివర్సిటీ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బి.ధర్మానాయక్ తెలిపారు. నల్లగొండలోని యూనివర్సిటీ రీజినల్ సెంటర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అతి తక్కువ ఫీజుతో దేశంలో ఏ యూనివర్సిటీ అందించని విధంగా బీఆర్‌ఓయూ బీఏ, బీకాం, బీఎస్‌స్సీ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సుల్లో చదువుకునేదుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు చదువుతోపాటు, స్వామి రామానంద తీర్థ రూరల్ ఇనిస్టిట్యూట్ ద్వారా ఏటా 5 వేల మంది గ్రామీణ గిరిజన విద్యార్థుల కోసం స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఆన్‌లైన ద్వారా దరఖాస్తు చేసుకొని అనంతరం మీరు ఎంచుకున్న స్టడీ సెంటర్‌లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేయించుకున్న తరువాత ట్యుషన్ ఫీజు చెల్లించాలని సూచించారు. సమావేశంలో రీజినల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్‌కుమార్, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ కోఆర్డినేటర్ సుంకరి రాజారామ్, కౌన్సిలర్లు పున్న అంజయ్య, శ్రీకాంత్, మహేష్ పాల్గొన్నారు.