
తిరుమలగిరి సాగర్ మండలంలో భూములపై హక్కులు
మండలంలో చేపట్టిన భూభారతి సర్వేలో బోగస్ పట్టా పాస్‌బుక్కులు కలిగి ఉన్న రైతులు ఉన్నట్లు తేలింది. 2,936 ఎకరాల భూమిపై 3,069 మంది రైతులు బోగస్ పాస్ పుస్తకాలు కలిగి ఉన్నట్లు తేల్చింది. వీటిని ప్రభుత్వం ఇటీవల రద్దు చేసింది. ఈ విషయాన్ని ‘సాక్షి’ గతంలోనే బోగస్ కృష్ణ‘పట్టా’ శీర్షికన ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. బోగస్ పట్టాలను సృష్టించి వివిధ పథకాలు పొందుతూ రూ.కోట్లు కొల్లగొట్టినట్లు ఈ కథనంలో పేర్కొంది. భూములు తమ ఆధీనంలోనే ఉన్నా ధరణి కారణంగా హక్కులను కోల్పోయిన వారి పరిస్థితులను కూడా సమగ్రంగా వివరించింది. ఇప్పుడు ప్రభుత్వం ఆ విషయాలన్నీ అధికారికంగా నిర్ధారించింది.
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలంలోని 13 గ్రామాలకు చెందిన 4,219 మంది రైతులకు కొత్తగా పాస్‌బుక్కులు అందనున్నాయి. 4,037 ఎకరాలపై ఆయా రైతులకు హక్కులు దక్కబోతున్నాయి. వారందరికీ ప్రభుత్వం త్వరలోనే పట్టాలను పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భూభారతి అమలులోకి తీసుకొచ్చిన తర్వాత జిల్లాలోని తిరుమలగిరి సాగర్ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుంది. ఆ మండలంలోని 235 సర్వే నంబర్లను గుర్తించి వాటి పరిధిలోని 23 వేల ఎకరాల్లో సర్వే నిర్వహించి, 12 వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా గుర్తించింది. అందులో 8,037 ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉన్నట్లు తేల్చింది. అందులోనూ 4 వేల ఎకరాలకు సంబంధించి రైతులు ఇప్పటికే పాస్‌బుక్కులు కలిగి ఉండి భూమిని సాగు చేసుకుంటున్నట్లు తేల్చింది. మరో 4,037 ఎకరాల పరిధిలో పాస్‌బుక్కులు లేకుండా సాగు చేసుకుంటున్నారని, వారందరికీ హక్కులు కల్పించాలని నిర్ణయిచింది. మరోవైపు తల్లిదండ్రులు చనిపోయిన వారికి పౌతి ద్వారా భూభారతిలో హక్కులను కల్పించేలా చర్యలు చేపట్టింది.
చింతలపాలెంలో ఎక్కువ మందికి లబ్ధి
మండలంలోని చింతలపాలెం గ్రామంలో అధిక విస్తీర్ణంలో అత్యధికంగా 1,288 మంది రైతులకు భూములపై పూర్తిస్థాయి హక్కులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆయా భూములను సాగు చేసుకుంటున్న రైతులుగా వారి పేర్లను భూభారతిలో నమోదు చేసింది. 519 మంది రైతులకు 591 ఎకరాల భూమిపై హక్కులు కల్పించనుంది. అతి తక్కువగా జమ్మికుంట గ్రామంలో 41 మంది రైతులకు 22 ఎకరాల్లో పట్టాలను అందజేయనుంది.
పాస్‌బుక్కులు అందుకోనున్న రైతులు
గ్రామం రైతులు ఎకరాలు
చింతలపాలెం 1,288 1,537
నెల్లికల్ 420 364
తునికినూతల 261 344
తిరుమలపాలెం 519 591
ఎల్లాపురం 264 241
రాజవరం 350 179
నేతాపూర్ 345 261
కొంపల్లి 180 123
కొన్నేరుపురం 163 92
అల్వాల 204 197
శ్రీరాంపురం 97 45
సిల్గాపురం 87 35
జమ్మికుంట 41 22
మాకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తిమ్మయపాలెం శివారులోని సర్వే నంబర్ 60లో 1.05 ఎకరాల లావుణి పట్టాలు పంపిణీ చేసింది. 2017 వరకు అన్ని పథకాలు వర్తించాయి. ధరణిలో మా భూమిని పార్ట్–బీలో పెట్టడంతో ఒక్క రైతుబంధు ద్వారానే ఇప్పటి వరకు రూ.90వేలు కోల్పోయిన. ప్రస్తుత ప్రభుత్వం కాస్తుకాబ్జా ఆధారంగా సర్వే చేసి నా భూమి భూభారతిలో నమోదు చేసింది. 1బీ, పహాణీలు సైతం వస్తున్నాయి. ప్రతి సంక్షేమ పథకానికి అర్హున్ని అవుతాను.
– మేరావత్ మునినాయక్, నాయకునితండా
మా భూములు మొన్నటి వరకు పార్ట్–బీలో ఉండడంతో మాకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు రాలేదు. మేము సేద్యం చేస్తూ భూమిపై కబ్జాలో ఉన్నప్పటికీ మాకు ఎలాంటి హక్కులు లేవు. మేము పండించిన పంటను కూడా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోలేకపోయా. దీంతో మేము ఆర్థికంగా చాలా నష్టపోయినాం. నాకు చింతలపాలెం గ్రామ రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 222లో ఉన్న 3 ఎకరాల భూమి భూభారతి పోర్టల్‌లో నమోదై ఉంది.
– సఫావత్ పూలా, సఫావత్‌తండా
ఫ 13 గ్రామాల రైతులకు త్వరలోనే పట్టాల పంపిణీ
ఫ 4,037 ఎకరాలపై 4,219 మందికి కొత్త పాస్‌బుక్కులు
ఫ అత్యధికంగా చింతలపాలెం వాసులకు లబ్ధి
ఫ నిరుపేద రైతుల్లో వెల్లివిస్తున్న ఆనందం
ఈయన నేనావత్ శంకర్ నాయక్. ఈయనది తిరుమలగిరి(సాగర్) మండలం నాగార్జునపేట తండా. నాగార్జునసాగర్ ముంపు బాఽధితుడు కావడంలో 1978లో అప్పటి ప్రభుత్వం ఈయనకు చింతలపాలెం రెవెన్యూ శివారులోని సర్వే నంబర్ 12లో 2.20 ఎకరాల భూమికి డీఫార్మ్ పట్టా ఇచ్చింది. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ పథకాలతోపాటు బ్యాంకులో రుణాలు పొందారు. గత ప్రభుత్వం ధరణిలో ఈ సర్వే నంబర్‌ను వివాదాస్పద భూముల పేరుతో పార్ట్–బీలో చేర్చింది. దీంతో ఽఆయనకు కొత్త పాస్ పుస్తకం రాలేదు. అప్పటి నుంచి రైతుబంధు, రుణమాఫీ ఆగిపోయింది. ప్రస్తుతం ప్రభుత్వం చేపట్టిన భూభారతి పైలెట్ సర్వేలో కాస్తు, కబ్జా ఆధారంగా అధికారులు మళ్లీ నమోదు చేశారు. దీంతో ప్రభుత్వాలు అందజేసే సంక్షేమ పథకాలు ఇకనుంచి అందనున్నాయని ఆయన సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ఈయనొక్కరే కాదు మండలంలో వేల మంది రైతుల సమస్య తీరబోతోంది. వారందరికీ భూభారతిలో ప్రస్తుత ప్రభుత్వం హక్కులను కల్పిస్తూ త్వరలో పట్టాలు ఇవ్వనుండడంతో తిరిగి సంక్షేమ పథకాలను పొందే వీలు ఏర్పడనుంది. దీంతో ఆయా రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.

తిరుమలగిరి సాగర్ మండలంలో భూములపై హక్కులు

తిరుమలగిరి సాగర్ మండలంలో భూములపై హక్కులు

తిరుమలగిరి సాగర్ మండలంలో భూములపై హక్కులు

తిరుమలగిరి సాగర్ మండలంలో భూములపై హక్కులు