
యూరియా కోసం రోడ్డెక్కిన రైతులు
నిడమనూరు ఏఓ సస్పెన్షన్
నిడమనూరు : నిడమనూరు రైతు ప్రాథమిక సహకార సంఘానికి వారం రోజులుగా యూరియా రాకపోవడంతో గురువారం రైతులు ఆగ్రహించారు. ఉదయం 6 గంటలకే సంఘం కార్యాలయం వద్దకు అక్కడి చేరుకున్న రైతులు వెంటనే యూరియా సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ నిడమనూరుక బస్టాండ్ వద్ద జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై రెండు గంటలకుపైగా రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ నిడమనూరు సహకార సంఘానికి ఈ వారంలో యూరియా రాలేదన్నారు. వారం క్రితం పలు ఎరువుల దుకాణాలకు దాదాపు 140 మెట్రిక్ టన్నుల వరకు యూరియా రావడంతో వారు కొందరు రైతులకే ప్రభుత్వ ధరకు అమ్మి మిగతాది అధిక ధరలకు విక్రయించుకున్నారని ఆరోపించారు. నిడమనూరు, వెనిగండ్ల సహకార ఎరువుల విక్రయకేంద్రంలో కొందరు ఉద్యోగులు కూడా అక్రమాలకు పాల్పడి యూరియాను పక్కదారి పట్టిస్తున్నారని వాపోయారు. సహకార సంఘాల ద్వారానే యూరియాను విక్రయించి తమను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అయితే నిడమనూరు ఎస్‌ఐ శిక్షణకు వెళ్లడంతో, హాలియా ఎస్‌ఐ సాయిప్రశాంత్ రైతుల వద్దకు వచ్చి వారికి నచ్చచెప్పి ధర్నాను విరమింపజేశారు.
ఫ నిడమనూరులో జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై రాస్తారోకో
ఫ ప్రాథమిక సహకార సంఘాల్లోనే
విక్రయించాలని డిమాండ్
యూరియా పంపిణీలో జరిగిన అవకతవకలు, రైతుల రాస్తారోకోపై స్పందించని నిడమనూరు ఏఓ మునికృష్ణయ్యను కలెక్టర్ సస్పెండ్ చేసినట్లు హాలియా ఏడీ సరిత గురువారం తెలిపారు. నిడమనూరులో గురువారం ఉదయం జడ్చర్ల–కోదాడ రహదారిపై రైతులు ధర్నా చేశారు. ధర్నాపై వ్యవసాయాధికారి సకాలంలో స్పందించలేదని జిల్లా పోలీస్ ఉన్నతాధికారులకు స్థానిక పోలీసులు వివరించారు. దీంతో ఎస్పీ వెంటనే ధర్నా వివరాలను కలెక్టర్‌కు వివరించడంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం నిడమనూరు మండలం నారమ్మగూడెం, ముకుందా పురం, నిడమనూరు, బొక్కమంతలపహా డ్‌లోని ఎరువుల దుకాణాలకు వచ్చి యూరియా పక్కదారి పట్టిందనే ఆరోపణలున్నాయి. ఈ విషయాన్నే రైతులు ప్రస్తావించారు. అయితే సస్పెండైన ఏఓ మునికృష్ణయ్య హాలియా, తిరుమలగిరి సాగర్ మండలాలకు ఇన్‌చార్జి ఏఓగా వ్యవహరిస్తున్నారు.