
డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రమాదం
సంస్థాన్ నారాయణపురం: సంస్థాన్ నారాయణపురం మండలం జనగాం గ్రామ శివారులో కారును తప్పించబోయిన ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ ఆర్టీసీ డిపోనకు చెందిన టీజీ 05 జెడ్ 0045 నంబర్ గల బస్సు గురువారం చండూరు నుంచి జనగాం మీదుగా చౌటుప్పల్‌కు వెళుతోంది. ఈ క్రమంలో జనగాం నుంచి సంస్థాన్ నారాయణపురం వెళ్లే దారిలో కారు ఒకేసారి రోడ్డుపైకి వచ్చింది. కారును తప్పించే క్రమంలో బస్సు రోడ్డు పక్కకు దూసుకుపోయింది. బస్సు టైర్లు, ఇంజన్ భూమిలోకి దిగబడ్డాయి. బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి సమయస్ఫూర్తిగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఆ పక్కనే బొంగోల కుంట ఉంది. కొంత అజాగ్రత్తగా వ్యవహరించినట్లయితే బస్సు కుంటలోకి దూసుకెళ్లేది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. సంఘటన జరిగిన సమయంలో వర్షం కురుస్తుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తర్వాత వచ్చిన బస్సులో ప్రయాణికులను తరలించారు. పోలీసులు అక్కడకు చేరుకుని సంఘటన జరిగిన తీరుపై ఆరా తీస్తున్నారు.
ఫ బస్సులో 100 మందికి పైగా
ప్రయాణికులు
ఫ అందరూ సురక్షితం