
హైవేపై లారీ బోల్తా
బీబీనగర్: జాతీయ రహదారిపై బీబీనగర్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ గూడ్స్ లారీ అదుపు తప్పి బోల్తా పడిన ఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాలు.. గూడ్స్ లారీ భువనగిరి వైపు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా పోలీస్‌స్టేషన్ దాటగానే బ్రిడ్జిపై అదుపు తప్పింది. లారీ పల్టీ కొట్టగానే డ్రైవర్ సుక్‌శాంత్ దావ్‌లే లారీలోనుంచి ఎగిరి బ్రిడ్జి కింద వాగులో పడిపోయాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయాలపాలైన డ్రైవర్‌ను వాగులో నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. లారీ హైవేపై అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో సర్వీస్ రోడ్డు గుండా వాహనాలను మళ్లించి క్రేన్‌తో లారీని పక్కకు తీయించారు.
తండ్రిపై మమకారం..
వ్యవసాయ క్షేత్రంలో ప్రతిరూపం
ఆత్మకూర్ (ఎస్) : కనిపెంచిన తండ్రి విలువను వారు వదులుకోలేదు. తమ నుంచి తండ్రి దూరమై ఏడాదైనా ఆ జ్ఞాపకాలను అలాగే నెమరవేసుకున్నారు. తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని తమ వ్యవసాయ క్షేత్రంలో ఆవిష్కరించుకుని ప్రేమను చాటుకున్నారు ఆ కుమారులు. ఆత్మకూర్ (ఎస్) మండలం గట్టికల్ గ్రామానికి చెందిన సీపీఎం సీనియర్ నాయకుడు గుండు అబ్బయ్య ఏడాది క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. కాగా తమ తండ్రి జ్ఞాపకార్థం ఆయన కుమారులు గుండు లింగయ్య, గుండు రమేష్.. అబ్బయ్య విగ్రహాన్ని తయారు చేయించారు. గురువారం అబ్బయ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా గ్రామంలోని తమ వ్యవసాయ క్షేత్రంలో స్థానిక సీపీఎం నాయకులతో కలిసి విగ్రహాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో గుండు చిన్న లింగయ్య, రాచకొండ రమేష్, మడ్డి రమేష్, బుర్ర సోమయ్య, దండంపెల్లి కృష్ణయ్య, బైరు వెంకన్న, శంకర్, గుండు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.

హైవేపై లారీ బోల్తా