
చికిత్స పొందుతున్న ముగ్గురు మృతి
భూదాన్‌పోచంపల్లి : ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్‌పోచంపల్లి మండలం దంతూర్ గ్రామానికి చెందిన రైతు దోటి నాగార్జున (43) ఆర్థిక ఇబ్బందులతో మనస్తాపం చెంది బుధవారం తన వ్యవసాయ బావి వద్ద గుళికల మందు తాగాడు. అనంతరం తాను క్రిమిసంహారక మందు తాగానని చిన్న కుమారుడైన శివకు ఫోన్ చేసి చెప్పాడు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు.. ఘటనా స్థలానికి చేరుకుని చూడగా నాగార్జున అపస్మారక స్థితిలో కిందపడి ఉన్నాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందాడు. గురువారం మృతుడి పెద్ద కుమారుడు శ్రీనాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కె. భాస్కర్‌రెడ్డి తెలిపారు. కాగా మృతుడికి భార్య భాగ్యమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు.
పంచాయతీ కార్మికుడు..
మఠంపల్లి: మఠంపల్లి మండలంలోని బక్కమంతులగూడెం గ్రామ పంచాయతీలో తాత్కాలిక పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్న బుర్రా ఏడుకొండలు(49) చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడుకొండలు నాలుగురోజుల క్రితం బక్కమంతులగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని త్రివేణినగర్ వద్ద గల వాటర్ ట్యాంకును లోపలి భాగంలో శుభ్రం చేసే క్రమంలో జారిపడ్డాడు. ట్యాంకులో నీరు లేకపోవడంతో తలకు తీవ్ర గాయాలై కోమాలోకి వెళ్లాడు. బంధువులు చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని తెలిపారు. మృతుడికి భార్యా, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
గుర్తు తెలియని మహిళ..
పెద్దఅడిశర్లపల్లి : చికిత్స పొందుతున్న గుర్తు తెలియని మహిళ మృతిచెందిన ఘటన పెద్దఅడిశర్లపల్లి మండలంలో చోటుచేసుకుంది. గుడిపల్లి ఎస్‌ఐ నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 6వ తేదీన పెద్దఅడిశర్లపల్లి మండలంలోని నీలంనగర్ సమీపంలో జడ్చర్ల–కోదాడ జాతీయ రహదారిపై సుమారు 40 సంవత్సరాల వయసు కలిగిన గుర్తు తెలియని మహిళను గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను దేవరకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలియరాలేదు. మృతదేహాన్ని గుర్తించినట్లయితే గుడిపల్లి పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌ఐ కోరారు.